ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్షంగా ఐదేళ్ల పాటు పోరాడారు. ఆ సమయంలోనే ఆయన తన స్పష్టమైన విజన్‌తో తెర ముందుకు వచ్చారు. ప్లీనరీ వేదికగా.. నవరత్నాలను ప్రకటించి.. మనసా..వాచా.. వాటిని అమలు చేస్తానని ప్రజలు పదే పదే చెప్పడం ప్రారంభించారు. వాటిలో చాలా వరకు.. అప్పటి అధికారపక్షం చివరిలో అమలు చేయడం ప్రారంభించినప్పటికీ.. ఆయన వెనుకడుగు వేయలేదు. ఆ రత్నాలను మరింత మెరుగుపరచి.. ఇస్తామన్నారు. ప్రజల మనసుల్ని దోచారు. ఓట్ల రూపంలో పట్టం కట్టించుకున్నారు. ఇప్పుడు.. ఆ హామీలన్నీ అమలు చేయడానికి అదే.. మనసా.. వాచా..కర్మణా ప్రయత్నిస్తున్నారు. అది బడ్జెట్లో ప్రతిఫలించింది.
మాట తప్పలేదు.. నవరత్నాలకు మెరుపులే..!
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదివి వినిపిస్తూంటే… ప్రతి ఒక్కరికి.. ఏదో ఓ ప్రయోజనం కనిపించిందంటే అతిశయోక్తి కాదు. రైతులు, పేదలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, వితంతువులు, వికలాంగులు… ఇలా అన్ని వర్గాల వారికీ నగదు ప్రయోజనం అందే పథకాలకు బడ్జెట్లో చోటు దక్కింది. ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా అండనిచ్చేందుకు ఉద్దేశించిన పథకాలకే అత్యధిక కేటాయింపులు చేశారు. రూ.2.27 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.75 వేల కోట్లకు పైగా సంక్షేమ రంగానికే కేటాయించారు. రైతుల కోసం ఏకంగా రూ.28,866 కోట్లు కేటాయించారు. నవవరత్నాల్లో దాదాపు ఎనభై శాతం పథకాలకు నిధులు కేటాయించారు. వచ్చే ఏడాది మిగతా ఇరవై శాతం పథకాలను కూడా అమలు చేయాలని.. జగన్ సంకల్పించారు.
బడ్జెట్ రూపంలో కనిపించిన మేనిఫెస్టో..!
మేనిఫెస్టోను.. ఓ బైబిల్‌గా.. ఓ భగవద్గీతగా.. ఓ ఖురాన్‌గా భావించాలని.. జగన్మోహన్ రెడ్డి.. ఎప్పుడూ చెబుతూంటారు. ప్రతి ఒక్కరి దగ్గర తన మేనిఫెస్టో ఉండాలని ఉద్యోగులనూ ఆదేశించారు. దానికి తగ్గట్లుగానే.. ఆయన సచివాలయం చాంబర్‌కు వెళ్లే దారిలో గోడలకు నవరత్నాల పోస్టర్లనూ అంటించమని ఆదేశించారు. అలా మాటకే కాదు… చేతల్లోనూ.. ఆ నవరత్నాలను ప్రజలకు అందించేందుకు బడ్జెట్ ద్వారా ప్రయత్నించారు. హామీలన్నింటికీ నిధులు కేటాయించారు. ఓ రకంగా.. చూస్తే.. బడ్జెట్ పత్రంలో.. వైసీపీ మేనిఫెస్టోనే కనిపించిందంటే… అతిశయోక్తి కాదు. ఆర్థిక భారమైన పథకాలను ఎన్నికల ముందు వరకూ.. అమలు చేయకుండా.. హడావుడిగా అమలు చేస్తే.. ప్రజా విశ్వాసాన్ని పొందలేమన్న ఉద్దేశంతో.. భారమైనా ముందుగానే ముందడుగు వేశారు.
అమరావతిపై క్లారిటీ ఇచ్చేసినట్లే..!
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు కళ్ల ముందు కనిపించే అభివృద్ధికి కూడా.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. ఐదు వేల కోట్లకుపైగా కేటాయించి.. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న ధీమాను ప్రదర్శించింది. అదే సమయంలో.. అమరావతి నిర్మాణానికి రూ. ఐదు వందల కోట్లను కేటాయించి..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఎక్కడా అమరావతి లేదు. సీఎం కూడా ఎన్నికల సభల్లో ఎక్కడా రాజధాని గురించి చెప్పలేదు. ఆ తర్వాత కూడా చెప్పలేదు. అమరావతి కోసం రూ. ఐదు వందల కోట్లు కేటాయించారంటే.. అమరావతి విషయంలో.. జగన్ పాజిటివ్ గానే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అమరావతిని ప్రాధాన్యతగా నిర్ణయించుకున్న తర్వాత.. నిర్మాణలను పరుగులు పెట్టించే అవకాశం ఉంది.
మొత్తానికి.. అధికారం కట్టబెట్టిన నవరత్నాలతో.. ప్రజలకు అభిషేకం చేయడానికి ప్రభుత్వం తొలి పద్దులో ప్రయత్నించింది.