జి ఎస్ టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) లో మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు ఎక్కువ వున్న రాష్ట్రాలపై విధించాలనుకున్న అదనపు పన్నుని తొలగించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయం వివరించి జిటిఎస్ బిల్లుకి రాజ్యసభలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరడానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు.
జిఎస్టి బిల్లును కాంగ్రెస్ సమర్థించే పక్షంలో బడ్జెట్ సమావేశాలను ముందుగానే ప్రారంభిద్దామని వెంకయ్య సోనియాకు సూచించినట్టు చెబుతున్నారు.
జీఎస్టి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే ఎక్సైజ్సుంకం, సేవలపన్ను, అమ్మకపు పన్నుల స్థానే ఏకపన్ను వ్యవస్థ అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయం, జాతీయ వాణిజ్యరంగం భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా అమలు కావాలని డిమాండ్ స్ధాయిలో కోరుతున్నాయి. ఇందుకు ఆధారం కాగల జిఎస్టి బిల్లును అమలులోకి తీసుకురావాలని కేంద్రం పట్టుదలతో ఉంది. అయితే బిజెపికి రాజ్యసభలో తగినంత మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు చట్టకాలేదు. శీతాకాల సమావేశాల్లో జిఎస్టి బిల్లును పాస్ చేసేందుకు కేంద్రం చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో బడ్జెట్ సమావేశాల్లోనైనా జిఎస్టి బిల్లును గట్టెక్కించేందుకు కేంద్రం మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టింది.
జిఎస్టి బిల్లు కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. జిఎస్టి బిల్లులో మూడు అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి సూచిస్తోంది. మూడింటిలో రెండింటికైనా ఆమోదం తెలిపి కాంగ్రెస్ను సంతృప్తి పరచే పనిలో కేంద్రం ఉంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి ఆఖరు వారంలో ప్రారంభమౌతాయి. జిఎస్టి బిల్లుపై కాంగ్రెస్తో కేంద్రానికి అవగాహన కుదిరితే బడ్జెట్ సమావేశాలు ముందే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జిఎస్టితో పాటు మరికొన్ని కీలక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బిజెపికి మెజారిటి ఉండడంతో లోక్సభలో బిల్లులు ఆమోదం పొందినా రాజ్యసభలో విపక్షాల ఆధిపత్యం కారణంగా పలు బిల్లులు పాస్ కాలేక పోతున్నాయి. మిగిలిన బిల్లులు ఎలావున్నా ఏప్రిల్ 1 నుంచి ఏకీకృత పన్ను విధింపు అమలు చేయాలన్న పట్టుదలతో జిఎస్టి బిల్లును ఆలోగానే చట్టం చేయాలని భావిస్తోంది.