ఈరోజున శ్రీరాముడి కల్యాణం, వచ్చే నెల 23న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి పట్టాభిషేకం అంటూ ధీమా వ్యక్తం చేశారు టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న. ఎన్నికలు జరిగిన దగ్గర్నుంచీ చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం అంటూ వైకాపా నాయకులు అంటున్నారనీ, ఆయనకి నిజంగానే ఓటమి భయం ఉంటే ఎన్డీయేలోనే ఉండేవారు కదా అన్నారు. తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక రకమైన నిరుత్సాహం స్రుష్టించడానికి మైండ్ గేమ్ ఆడుతున్నారని వెంకన్న అన్నారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి ఒత్తిళ్లు చాలా తట్టుకున్నారని అన్నారు.
ఈవీఎంల గురించి పోరాటం చేస్తున్నారనీ, ఇవే ఈవీఎంలు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినప్పుడు మీరు మాట్లాడలేదని చంద్రబాబుపై వైకాపా నాయకులు విమర్శిస్తున్నారు అన్నారు వెంకన్న. 2014లో ప్రధానమంత్రిగా మోడీ లేరనీ, ఇవాళ్ల ఈ దేశానికి ఒక శాడిస్టు ప్రధానమంత్రిగా ఉన్నాడన్నారు. అందుకే అనుమానాలు వ్యక్తమైతే చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. మహిళలు పెద్ద ఎత్తున టీడీపీకి అనుకూలంగా ఓటేస్తున్నారని తెలియగానే, ఈవీఎంలు పనిచేయకుండా పోయాయన్నారు. దీన్ని ప్రశ్నించడం తప్పా, మీరెందుకు కామ్ గా ఉన్నారూ అన్నారు. మహిళలు ఓట్లు వైకాపాకి పడవని ముందే తెలిసిపోయిందనీ, సహజంగా మహిళలు ఉదయాన్నే ఓటింగ్ కి వస్తారని గ్రహించి, ఈవీఎంలు పనిచేయకుండా కుట్ర చేశారన్నారు. తొడ కొట్టి చెప్తున్నామనీ, (లేచి, నిలబడి తొడగొట్టి) రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు.
దాడి వీరభద్రరావు, జీవీఎల్ నర్సింహారావు, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ… ఏం లేకుండానే వీళ్లు ఇంతగా ఇదైపోతున్నారే అంటూ ఎద్దేవా చేశారు వెంకన్న. రాష్ట్రంలో ఈవీఎంలు మొరాయిస్తే… ఈసీ బాగా పనిచేసిందని విజయసాయి రెడ్డి కితాబిచ్చారన్నారు. మొత్తానికి, ఎన్నికలైన దగ్గర్నుంచీ గెలిచేశామన్న ధీమాతో జగన్ తో సహా వైకాపా వర్గాలున్నాయన్నది వాస్తవం. అదే సమయంలో… గెలుపుపై ధీమా ఉన్నా, కొంత స్తబ్దత టీడీపీ వర్గాల్లో నెలకొన్న మాట వాస్తవమే. నిన్న సబ్బం హరి ప్రెస్ మీట్ పెట్టి గెలుపుపై కొంత ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ్ల చంద్రబాబు కూడా మాట్లాడుతూ… ఓటమి భయంతో తాను ఢిల్లీలో తిరుగుతున్నానని విమర్శలు చేయడం సరికాదనడం… ఇప్పుడు బుద్ధా వెంకన్న… ఇవన్నీ చూస్తుంటే వైకాపా నేతల ధీమాకి కౌంటర్ గా టీడీపీ రియాక్ట్ అవుతోందని చెప్పొచ్చు.