వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి… సంయుక్తంగా ఓ ఊతపదాన్ని క్యాప్షన్‌లా వాడుకుంటూ ఉంటారు. అదే ” మాట తప్పం.. మడమ తిప్పం…” అనే పదం. అటు పార్టీ పరంగా.. ఇటు ప్రభుత్వ పరంగా… రాజకీయ కోణాల్లోనూ.. ఎన్నో సార్లు మాట తప్పినప్పటికీ.. నిస్సంకోచంగా.. ఈ పదాన్ని వాడేసుకుంటూ ఉంటారు. అయితే.. ఎప్పుడూ.. దాన్ని సమర్థించుకోవడం కష్టం కాబట్టి.. అసలు ఈ ” మాట తప్పం.. మడమ తిప్పం…” అనే కాన్సెప్ట్‌కే కొత్త అర్థం కనిపెట్టేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత మేధావిగా పేరు పడిన… ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అసెంబ్లీలో… ఈ ” మాట తప్పం.. మడమ తిప్పం…”ను.. ఇంగ్లిష్‌లో.. “డైనమిజం”గా… మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి డైనమిక్‌గా రాజకీయాలు చేస్తున్నారని ప్రకటించేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు.. సాగునీటి ప్రాజెక్టుల చర్చ జరిగింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లడం ఏమిటన్న విమర్శలు టీడీపీ నేతల నుంచి వచ్చాయి. దీన్ని జగన్మోహన్ రెడ్డి.. విచిత్రంగా కవర్ చేసుకున్నారు. తాను వెళ్లినా వెళ్లకపోయినా స్విచ్చాన్ చేసి ఉండేవారని..అసలు అది కడుతూంటే.. టీడీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఆ సమయంలో.. గతంలో.. కాళేశ్వరంపై.. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ చేసిన విమర్శలను… చంద్రబాబు గుర్తుకు తెచ్చారు. అప్పుడే.. రాజేంద్రనాథ్ రెడ్డి.. తన మేధావి తనాన్ని బయటకు తీసి.. జగన్‌కు.. రక్షణగా వచ్చారు. కాళేశ్వరంపై… తమ విధానం “డైనమిక్”గా ఉందని ప్రకటించేశారు. అంటే.. సందర్భోచితంగా.. అభిప్రాయాల్ని మార్చుకోవడం అట.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన ” మాట తప్పం.. మడమ తిప్పం…” మార్క్ డైనమిజం సామాన్యులకు అర్థం కాదు. ఎందుకంటే… అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారట. ఇప్పుడు… అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్.. ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లారట. అప్పుడు పోయే ప్రయోజనాలేమిటో.. ఇప్పుడు వచ్చే ప్రయోజనాలేమిటో.. మళ్లీ డైనమిక్ గా అవసరం వచ్చినప్పుడు.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతారు కావొచ్చనే సెటైర్లు టీడీపీ వైపు నుంచి పడ్డాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అయితే.. ఈ డైనమిజంలో మరింత రాటుదేలిపోయారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను.. జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ప్రకటించేశారు. దీంతో.. అదేదో యాడ్‌లో అడిగినట్లుగా…” అవాక్కయ్యారా..?” ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.