మూడు రాజధానులు అనేది పూర్తిగా మిస్ కమ్యూనికేషన్ అట… మూడు రాజధానులు అనేది పూర్తిగా తప్పుడు ప్రచారమట..ఈ మాట చెప్పింది టీడీపీ వాళ్లయితే కామనే అనుకోవచ్చు..కానీ ఈ మాట చెప్పింది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నాలుగేళ్ల తర్వాత ఏపీకి పెట్టుబడులు అవసరం అని గుర్తించారు. అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇందు కోసం పారిశ్రామికవేత్తల్ని ఏపీకి ఆహ్వానించేందుకు మెట్రో సిటీల్లో స్టార్ హోటళ్లలో గెట్ టు గెదర్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు పరిశ్రమ మంత్రి అమర్నాథ్ వెళ్లారు.
ఏపీ గురించి చెప్పాల్సినదంతా చెప్పిన తర్వాత ఇన్వెస్టర్లు వ్యక్తం చేసిన సందేహాలకు బుగ్గన సమాధానం ఇచ్చారు. ఓ ఇన్వెస్టర్ మూడు రాజధానుల గురించి ప్రస్తావించారు. ఏపీలో మూడు రాజధానులట కదా అని అడిగితే బుగ్గన సమాధానం ఠక్కున చెప్పారు. అదంతా తప్పుడు ప్రచారమని తేల్చేశారు. ఏపీలో ఒక్క రాజధానే ఉంటుందని అది విశాఖేనని చెప్పుకొచ్చారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి బుగ్గన చెప్పిన మాటలు కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
మూడు రాజధానులు అనేది వైసీపీ విధానం. అందు కోసం వారు చేయని అక్రమం అంటూ లేదు. భూములిచ్చిన వేల మంది రైతుల్ని రోడ్డున పడేశారు. కర్నూలులో న్యాయరాజధాని అని అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టింది ఈ బుగ్గనే. జగన్నాథ గట్టు మీద న్యాయరాజధాని పెడతామని రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి కూడా బుగ్గనే. ఇప్పుడు ఒకటే రాజధాని అన్నీ విశాఖ నుంచే జరుగుతాయని చెప్పుకొస్తున్నారు. మూడు రాజధానులు అంటే ఇన్వెస్టర్లు ఎవరూ రారని చివరికి ఒక్క రాజధానికి ఫిక్సవుతున్నారు. ఈ విషయం ముందుగా తెలియదా ?
ఇంత కాలం మూడు రాజధానుల పేరుతో మభ్య పెట్టి ఇప్పుడు ఒకే రాజధాని అంటోంది ప్రభుత్వం. ఇది కూడా ఇన్వెస్టర్లను మోసం చేయడానికా లేకపోతే… నిజంగానే ఒక్క రాజధానికే ఫిక్సవుతుందా అన్నది ముందు ముందుతేలాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఎవరినైనా మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యలాగా… వ్యవహారాలను మోసపూరితంగానే ముందు నుంచీ నడిపిస్తోంది.