తేనెటీగలు పువ్వుకు నష్టం కలగకుండా మకరందాన్ని ఏవిధంగా సేకరిస్తాయో.. అదేవిధంగా వ్యాపారుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాపారాలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని ప్రభుత్వం టార్గెట్లు పెట్టిందంటూ అధికారులు తమపై ఇష్టారాజ్యంగా జరిమానాలు విధిస్తున్నారని.. వ్యాపారులంతా గగ్గోలు పెడుతున్నారు. ఆ అసంతృప్తి పెరిగిపోవడంతో చివరికి బుగ్గన అడ్వయిజరీ బోర్డు పేరుతో వ్యాపారుల సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వ్యాపారులంతా ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రభుత్వానికి డబ్బుల్లేకపోతే.. తమ వద్ద దారిదోపిడి చేస్తారా అని ప్రశ్నించారు. అసలు తమ వ్యాపారాలపై ఏ మాత్రం అవగాహన లేకుండానే తక్కువ బిల్లులు వేస్తున్నామని చెబుతూ.. రూ. లక్షల్లో ఫైన్స్ వసూలు చేస్తున్నారని..ఇదేం దందా అని వారు నిలదీశారు. అందరు వ్యాపారులు అదే అసంతృప్తి వ్యక్తం చేయడంతో బుగ్గనకు ఏం చెప్పారో అర్థం కాలేదు. తమ ప్రభుత్వ స్లోగన్.. జై జవాన్.. జగన్ కిసాన్.. జై బిజినెస్ మెన్ అంటూ…అర్థంపర్థం లేని కామెంట్లు చేసి సమావేశంలో గందరగోళం పెంచారు. ఈ వ్యాపారుల్లో అత్యధికులు వైసీపీకి చెందినవారే. అయినా అసంతృప్తి వ్యక్తం చేయడంతో బుగ్గనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
ఏపీలో ప్రజల్ని పన్నుల పేరుతో ఎలా పీడిస్తున్నారో… వ్యాపారుల్ని అంత కంటే ఎక్కువగా పీడిస్తున్నారు. ఏమీ లేకపోయినా అక్రమాలంటూ ఫైన్లు వేస్తున్నారు. ఈ దెబ్బకు వ్యాపారాలన్నీ ఆగమైపోతున్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగానికి చెందిన వ్యాపారాలన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతీ రంగంలోనూ వెనుకబాటు కనిపిస్తూండటంతో వారికీ గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వ విధానాల వల్ల మొత్తం నాశనం అయిపోతోందని వారూ ఆందోళన చెందుతున్నారు.