ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన రాష్ట్రానికి రావాల్సిన నిధుల జాబితా ఇచ్చి వెళ్లిన తర్వాతి రోజునే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో నిధులు మంజూరు చేయగలిగిన వారందరితో సమావేశం అవడం ప్రారంభించారు. మొదటగా ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ , ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో కూడా సమావేశమయ్యారు. ఏపీకి రావాల్సి నిధులపై వినతిపత్రాలిచ్చినట్లుగా బుగ్గన చెబుతున్నారు. అయితే..కొద్ది రోజుల కిందట.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులు రూ. 760 కోట్లను రిజెక్ట్ చేస్తున్నట్లుగా కేంద్రమంత్రి ప్రకటించారు. అవన్నీ తాము ఖర్చు పెట్టామని ప్రభుత్వం చబుతోంది.
ఆ రూ.760 కోట్ల బిల్లుల పున పరిశీలన చేయాలని బుగ్గన కోరారు. జీఎస్టీ బకాయిల అంశంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆప్షన్లపై చర్చించాల్సి ఉందని… ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని బుగ్గన చెబుతున్నారు.. అప్పు తీసుకోవడమే మేలైన మార్గాని జగన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో గతంలోనే తేల్చి చెప్పారు. బుగ్గన ఇంత హడావుడిగా ఢిల్లీకి వచ్చి అందర్నీ కలవడం వెనుక వేరే కారణం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ సర్కార్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకుంది. వచ్చే నెల ఒకటో తేదీకి పెన్షన్లు, జీతాలు, సామాజిక పెన్షన్లను చెల్లించాల్సి ఉంది.
ఈ నెల వచ్చిన ఆదాయం ఓవర్ డ్రాఫ్ట్‌కు చెల్లించడానికి సరిపోతుంది. ఈ క్రమంలో …అత్యవసర నిధుల కోసం.. బుగ్గన ఆర్థిక మంత్రిని కలిసినట్లుగా చెబుతున్నారు. గతంలో బుగ్గన ఆర్థిక మంత్రుల్ని కలిసినప్పుడు అమెరికాకు చెందిన ట్రస్ట్ అప్పిస్తానంటోందని… గ్యారంటీ ఇవ్వాలని కోరారు. ఆ విషయం తర్వాత ఎప్పుడో బయటకు వచ్చింది. ఇప్పుడు అంతర్గతంగా ఏ విషయం చర్చించారో… తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.