ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇంకా అందరికీ అందలేదు. అందుబాటులో ఉన్నంత వరకూ జీతాలు జమ చేస్తూ వస్తున్నారు. ఆర్బీఐ దగ్గర నుంచి వేస్ అండ్ మీన్స్ , ఓవర్ డ్రాఫ్ట్ లాంటి మార్గాలన్నీ ఇప్పటికే ప్రభుత్వం వినియోగించుకుంది. ఈ క్రమంలో అదనపు అప్పుల కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొత్త ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ నెల కూడా.. అదే పరిస్థితి. ఒకటి ,రెండు తేదీల్లో సగం మందికి కూడా జీతాల జమ కాలేదు. పెన్షనర్లకు అసలు జమ కాలేదు. దీంతో.. మళ్లీ గగ్గోలు రేగింది.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో ఎక్కేగడప.. దిగే గడప అన్నట్లుగా ఉన్నారు. అదనపు అప్పుల కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం మాత్రంఓ వైపు రుణ పరిమితిని తగ్గించడంతో పాటు… ఆర్బీఐ నుంచి ప్రతీ మంగళవారం తీసుకునే రెండు వేల కోట్ల బాండ్ల అప్పులు కూడా ఇకచేయవద్దని నిర్దేశించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే కేటాయించిన దాని కంటే ఎక్కువ అప్పులు చేశారని కేంద్రం తేల్చేసినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో..బుగ్గన కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సినదంతా చేస్తున్నారు. ఈ మంగళవారం ఆర్బీఐ నుంచి రెండు వేల కోట్లు అప్పు సర్దుబాటు చేయాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద ప్రభుత్వం బాండ్లు వేలం వేసి రుణాలు సేకరిస్తుంది. అయితే దానికి పరిమితులు ఉంటాయి. వడ్డీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది. ఈ అవకాశాన్ని ఏపీ సర్కార్ దాదాపుగా ప్రతీ మంగళవారం వాడుకుంటోంది. అవి వస్తేనే జీతాలకు సరిపడా నిధులు వస్తాయి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రేపు మంగళవారం.. బాండ్ల వేలం వేసి నిధులు సమీకరిస్తే.. బుధవారానికి నిధులు సర్దుబాటు అవుతాయి. అప్పుడు అందరికీ జీతాలు, పెన్షన్లు సర్దుబాటయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.