పోలవరం విషయంలో కేంద్రం నిధులకు పూర్తి స్థాయిలో కొర్రీలు పెడుతూండటంతో ఏపీ సర్కార్ చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ఇక తప్పదన్నట్లుగా గత ప్రభుత్వంపై నెట్టేస్తే సరిపోతుదన్న వ్యూహానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశమైన తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి .. నెపం అంతా టీడీపీపైకి నెట్టే ప్రయత్నం చేశారు. పోలవరం ఖర్చును పరిమితం చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని బుగ్గన ఆరోపించారు. పోలవరం విషయంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పోలవరం కాంట్రాక్టు పనులపైనే టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. ఇతర అంశాలు పట్టించుకోలేదన్నారు.
పోలవరాన్ని పూర్తిగా తామే నిర్మిస్తామని విభజన చట్టంలో కేంద్రం చెప్పిందని. పునరావాసం, భూసేకరణ ఖర్చు కేంద్రానిదే అని చట్టంలో ఉందని చెప్పుకొచ్చారు. అయితే.. కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ను 2014లో రాష్ట్రం తీసుకుందని.. 2014 నాటి ఖర్చు ఇవ్వాలని గత ప్రభుత్వం తీర్మానం చేసిందని ఆరోపించారు. 2014కి ముందు పెట్టిన ఖర్చును ఇవ్వాలని గత ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేస్తూ వస్తోంది. టీడీపీ హయాంలో చివరి ఏడాది పోలవరానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో రూ.55,548 కోట్లకు ఆమోదం లభించింది కూడా. ఇక ఆర్థిక శాఖ ఆమోదమో తరువాయి అనే సమయంలో.. కేంద్రం 2014 నాటి ధరలను మాత్రమే లెక్కిస్తామని చెప్పి.. షాక్ ఇచ్చింది.
దీంతో పోలవరం బాధ్యత నుంచి కేంద్రం తప్పుకున్నట్లవుతుంది. కేంద్రంపై ఒత్తిడి చేసి… జాతీయ ప్రాజెక్టును నిర్మించుకోలేని స్థితికి ఏపీకి వచ్చినట్లయింది. కొసమెరుపేమిటంటే… ప్రస్తుతం.. పోలవరంపై పెట్టిన ఖర్చుోల రూ. 2234 కోట్లు రీఎంబర్స్ చేయాల్సి ఉంది. పార్లమెంట్లో కూడా.. ఇచ్చేస్తున్నాం అని కేంద్రమంత్రులు చెప్పారు. కానీ.. ప్రస్తుతం తగ్గించిన అంచనాలను ఆమోదిస్తేనే ఆ మొత్తం ఇస్తామని లేకపోతే.. అవి కూడా ఇవ్వలేమని.. నిర్మలా సీతారామన్ కేంద్రానికి తేల్చి చెప్పేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఇప్పుడు గాల్లో వేలాడుతోందన్నమాట.