చిన్న గీత పక్కన పెద్దగీత గీస్తే తప్పు ఒప్పయిపోతుందని ఏపీ అధికారపార్టీ పెద్దలు అనుకుంటున్నారు. ఎలాంటి వాదనకైనా ఒకటే ఫార్ములా ప్రకటిస్తున్నారు. తాజాగా ఏపీ అప్పుల గురించి మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి .. ఇతర రాష్ట్రాల ఏపీ తక్కువ అప్పులు చేసిందని చెప్పుకొచ్చారు. ఆ రాష్ట్రాలు ఏమిటంటే తమిళనాడు,కర్ణాటక, కేరళ గురించి చెబుతున్నారు. అంటే మిగతా రాష్ట్రాలకన్నా ఎక్కువే చేశారు కదాఅనే లాజిక్‌ను మాత్రం మిస్సవుతున్నారు.
ఏ రాష్ట్రానికైనా అప్పులు ఎలా ఎక్కువ అంటే పక్కరాష్ట్రాలతో పోల్చిచూడరు… ఏపీ ఆదాయం ఎంత.. దానికి తగ్గట్లుగా ఎంత అప్పు చేశారు…ఆ అప్పులు ఎలావాడుతున్నారన్నదే చూస్తారు. ఇక్కడ వాటి గురించి చెప్పకుండా.. కరోనాను ప్రతీ సందర్భంలోనూ వాడేసుకుని… తాము అప్పులు చేయడానికి కరోనానే కారణమని వాదిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా అప్పులు చేశాయని.. తాము చేశామని వాదిస్తున్నారు. పనిలో పనిగా టీడీపీనే తమ కంటే ఎక్కువ అప్పులు చేసిందని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం శ్రీలంక పరిణామాలను చూపించి రాష్ట్రాలు జాగ్రత్త పడాలని ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
అందులో ఏపీ అప్పుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అదే సమయంలో ఆర్బీఐ… ఏపీకి అప్పులు ఇస్తున్న బ్యాంకుల కు ప్రత్యేకంగా కొన్ని లేఖలు రాసింది. ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతూండటంతో బుగ్గన రాజేంద్రనాథ్ వివరణ ఇచ్చారు. కొసమెరుపేమిటంటే బుగ్గన ప్రెస్‌మీట్ పెట్టింది ఢిల్లీలోనే. అప్పుల కోసం ఆయన పూర్తిగా ఢిల్లీలోనే ఉంటున్నారని ..విపక్షాలు చాలారోజులుగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అప్పులపై వివరణ ఇవ్వడానికి కూడా ఆయన ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.