ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ప్రశ్నిస్తూ.. అప్పు ఇస్తే తీర్చలేరన్నట్లుగా.. ఎస్బీఐ లేఖ రాయడం అనుచితమని… మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా ముందు అక్కసు వెళ్లగక్కారు. అది అత్యంత కాన్ఫిడెన్షియల్ లేఖ అని.. బయటకు రావడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై పెరుగుతున్న అనుమానాలు, వెల్లువెత్తుతున్న సందేహాల నేపధ్యంలో… వివరణ ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చి మరిన్ని అనుమానాలు లేవనెత్తేలా మట్లాడారు. ఏపీ పరిస్థితి బాగుందని.. నోటి మాటగా చెప్పుకొచ్చిన ఆయన … జగన్ ప్రభుత్వం పాలన చేపట్టిన మొదటి మూడు నెలల గణాంకాలను చెప్పాలని కోరిన మీడియాపై ఎదురుదాడి చేశారు. వృద్ధిరేటుపై ఇప్పుడేమీ చెప్పలేమని.. అలా చెప్పాలంటే.. ఎన్నో లెక్కలు చూడాల్సి ఉంటుందని కవర్ చేసుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో పది శాతానికిపైగా వృద్ధిరేటుతో ఉన్న ఏపీ ఇప్పుడు.. మైనస్ వృద్ధిలోకి పోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఆదాయం దారుణంగా పడిపోవడం.. ఖర్చులు పెంచుకుంటూ పోవడంతో పాటు.. సంపద సృష్టి విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడంతో… ఆదాయార్జన మార్గాలు కుంచించుకుపోయాయి. ఇసుక విధానం, మద్యం విధానం… సహా అనేక కీలక అంశాల్లో పరిణితి లేని నిర్ణయాలతో ఆదాయం పడిపోయింది. ఆ ప్రభావం… ఏపీ ఆర్థిక వృద్ధిరేటుపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్బీఐ లేఖ గురించి బాధపడిపోయిన బుగ్గన… అసలు పరిస్థితేమిటో చెప్పడానికి మాత్రం నిరాకరించారు.
మరో ఏడాది వరకూ.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు లేవని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితే ఉంటుందని.. ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పకనే చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను… ఇప్పుడు తీరుస్తున్నామని… మరో ఏడాదిలోపు చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఎంత సేపూ.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే.. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని చెప్పుకోవడానికి బుగ్గున ప్రాధాన్యం ఇచ్చారు. ఇంతా చేసి.. మీరు పరిమితంగా అప్పులు చేస్తారా.. అని మీడియా అడిగినప్రశ్నకు మాత్రం… అలాంటి అవకాసశమే లేదని… నిర్మోహమాటంగా సమాధానం చెప్పారు. కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకోక తప్పదన్నారు. మొత్తానికి బుగ్గనకు.. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగో లేదని… ఎస్బీఐ లేఖ రాయడమే కష్టంగా అనిపిస్తోంది. ఏపీ తిరోగమనంలో ఉండటం మాత్రం కాదు..!