ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆఫీసు ఎక్కడ ఉంటుంది ? ఏపీ సచివాలయంలో అని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ ఆయన ఆఫీసు ఢిల్లీలో ఓ స్టార్ హోటల్లో ఉంటుంది. నెలలో ఇరవై రోజులు ఆయన ఆ స్టార్ హోటల్లోనే ఉంటారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ అప్పుల అవసరాలు తీర్చడానికి ప్రముఖులతో భేటీ లు కావడానికి అక్కడ ఉంటున్నారు. గత రెండు, మూడేళ్ల నుంచి ఆయనది అదే పని. ఈ క్రమంలో ఆయన బీజేపీ నేతలకు బాగా దగ్గరయ్యారు. పేరు పెట్టి పిలుచుకునేంత సాన్నిహిత్యం కూడా వచ్చేసింది.
కొంత మంది ఆయన వస్తున్నారంటే అప్పుల అనుమతుల కోసం అని తప్పుకుంటున్నా… మరి కొంత మాత్రం పిలిచి కాఫీ, టీలు ఇచ్చి.. అప్పుల గురించి కాకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారు. రాజకీయ అంశాలపై బీజేపీ నేతలతో బుగ్గన ఎక్కువగా చర్చిస్తున్నట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలకు బుగ్గన బాగా దగ్గరవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి అవకాశాల్ని బీజేపీ పెద్దలు వదులుకోరు. ఆయనతో ఎంత రిలేషన్ కొనసాగించాలో కొనసాగించి ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు.
అందులో సందేహం ఉండదు. షిండే విషయంలో జరిగింది ఇదే. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైన రాజకీయ నాయకుడు. ఆయన మాస్ లీడర్ కాకపోవచ్చు కానీ.. రాజకీయ తెలివికి మాత్రం కొదువలేదని చెబుతారు. ఈ క్రమంలో వైసీపీలో బీజేపీకి దగ్గరైన నేతగా ఆయనకు చాన్సులు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఇలా ఉత్తరాంధ్ర సీనియర్ నేత ఒకరు ఢిల్లీ వచ్చి కేంద్ర పెద్దలతో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు బుగ్గనకు నేరుగా జగనే అవకాశం కల్పించారు. ఆయనకు తప్పడం లేదు మరి .. చివరికి ఏమవుతుందో ?