ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తైపోయాయిగానీ, వైకాపా నేతల విమర్శలూ ఆగ్రహాలూ అసంతృప్తులూ ఇంకా పూర్తవలేదు! ఎన్నికల ముందు వారి తీరు ఎలా ఉందో, ఇప్పుడూ అదే కొనసాగుతూ ఉంది. ఎన్నికలు జరిగిపోయిన తరువాత కూడా అధికార పార్టీ మీద విమర్శలు, ఆరోపణలు చేయడం వల్ల ఏం లాభం? అయినా… రాబోయేది వారి ప్రభుత్వమే అనే ధీమా వారికి ఉన్నప్పుడు… ఇంకా ఎందుకీ విమర్శలు, ఆరోపణలు? వైకాపా నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టి… చంద్రబాబు నాయుడుకి తన పరిపాలనపై నమ్మకం లేదనీ, అందుకే పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇది ఎప్పుడు చెయ్యాల్సిన విమర్శ? ఇప్పుడేం అవసరం? ఎన్నికల ముందు నవరత్నాలు, పెన్షన్ల పెంపు, అమ్మ ఒడి అంటూ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలు కూడా ఆయనకి గెలుపుపై నమ్మకం లేక ఇచ్చినవా..?
రాజధానిలో ఒక్క నిర్మాణం లేదనీ, అన్నీ పిచ్చి మొక్కలేననీ, పోలవరం అవినీతి ప్రాజెక్టనీ, పట్టిసీమ అవసరం ఏముందనీ, నిధుల కేటాయింపుల్లో నీతి ఎక్కడుందంటూ బుగ్గన విమర్శించారు. ఇసుక, మట్టి, బొగ్గు, ఆలయ భూములు ఇలా దేన్నీ వదలకుండా చంద్రబాబు నాయుడు దోచుకున్నారని ఆరోపించారు. రాజధానిలో నాలుగున్నరేళ్లపాటు హైకోర్టు ఏర్పాటు చేయలేదనీ, ఎన్నికలకు మూడు నెలల ముందే కోర్టు తెచ్చారన్నారు. చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే ఆయనకి అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. ఓపక్క 150 సీట్లు వస్తాయంటూనే, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనడం అర్థం లేదన్నారు.
ఈ ప్రెస్ మీట్ చూస్తుంటే ఏపీలో ఇంకా ఎన్నికలు కాలేదేమో అనిపిస్తుంది.! గత ప్రభుత్వంపై ఇంకా విమర్శలూ ఆరోపణలూ చేసి ఏం సాధిస్తారు..? ఇవన్నీ ఎన్నికల ముందు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఉంటే, వాటిని ప్రజలు నమ్మి ఉంటే, వైకాపాకి అనుకూలంగా ఓటు వేసి ఉంటారు కదా! వాళ్ల ధీమా కూడా అదే కదా. కానీ, వైకాపా నేతలే అసహనానికి గురౌతూ దాన్ని చంద్రబాబులో చూపించాలనే ప్రయత్నం ఎందుకు? ఓపక్క ఈసీ ద్వారా నడిపించాల్సిన మంత్రాంగమంతా నడిపిస్తున్నారన్నది ప్రజల్లో చాలామందికి ఉన్న అభిప్రాయం. అన్నీ వారికి అనుకూలంగా ఉన్నాయని అనుకున్నప్పుడు ఇంకా ఎందుకీ ఆవేదన? బుగ్గన మాత్రమే కాదు, ఇతర వైకాపా నేతలూ దాదాపు ఇదే ట్యూన్ లో ఉన్నారు. ఎన్నికలు జరిగిపోయాక కూడా పాత ధోరణిలోనే విమర్శలు చేస్తూ ఉన్నారు.