ప్యారడైజ్ పేపర్ల ప్రకంపనలు ఎపిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్యారడైజ్ పేపర్లలో జగన్మోహనరెడ్డి ప్రస్తావన ఉందని దానిపై సీబీఐ విచారణ జరగాలంటూ ఆదివారం ప్రెస్మీట్ పెట్టి విమర్శలు చేసిన అంధ్ర ప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడిపై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు.
ఇదివరకే జగన్ ఈ ఇష్యూలో తనకేమీ సంబంధం లేదని, తనకి సంబంధం ఉంటే నిరూపించాలని, అలా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన విషయం కూడా తెలిసిందే. అలాగే సాక్షి లో దీని గురించి ఒక విస్తృత కథనం కూడా ప్రచురించారు. ప్యారడైజ్ పేపర్లలో ఉన్నది హెటెరో కంపెనీ పేరు అనీ, కేవలం హెటెరో కూడా సాక్షి పెట్టుబడులకి సంబంధించి కేసులు ఎదుర్కొంటున్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని జగన్ కి ప్యారడైజ్ పేపర్లతో సంబంధం ఉందని ఎలా అంటారని ఆ కథనం ప్రశ్నించింది. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన కూడా ఇదే లాజిక్ ని ఇంకొంచెం సాగదీసి, ఈ ఇష్యూ లోకి చిరంజీవి ని నాగార్జునని లాగారు.
ప్యారడైజ్ పేపర్లలో నిమ్మగడ్డ ప్రసాద్ పేరు కూడా ఉంది కాబట్టి, ఆయన చిరంజీవి, నాగార్జున ల తో కలిసి వ్యాపారాలు చేసాడు కాబట్టి (మా టివి విషయం లో) మరి చిరంజీవి, నాగార్జున ల కి కూడా ప్యారడైజ్ పేపర్ల తో సంబంధం ఉన్నట్టా అని ఆయన అన్నారు. నిమ్మగడ్డతో నాగార్జున, చిరంజీవికి వ్యాపార భాగస్వామ్యం ఉన్నదనే కారణం చేత వారిద్దరిని కూడా టీడీపీ నేతలు విమర్శిస్తారా? అని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన ప్రశ్నించారు.
అయితే అనవసరంగా తమ పని తాము చేసుకుంటున్న హీరోలని (త్రివిక్రం బాష లో చెప్పాలంటే, తమ పాటికి తాము మాడిపోయిన మసాలా దోస తింటున్న వాళ్ళని) ఈ ఇష్యూలోకి లాగి ఆయా హీరోల అభిమానులకి చిరాకు తెప్పించి, మళ్ళీ వైసిపి నేతలు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని పరిశీలకులంటున్నారు.