చంద్రబాబునాయుడును నమ్ముకున్న వారికి ఇంకా పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కడం పూర్తి కాలేదు గానీ.. ప్రతిపక్ష నేత జగన్‌ను నమ్ముకున్న వారికి పదవులు వచ్చేస్తున్నాయి. అదేమిటి… జగన్ చేతుల్లో పంచడానికి పదవులు ఏం ఉంటాయబ్బా అని విస్తుపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో ‘ప్రధాన ప్రతిపక్ష నేత’ తర్వాత విపక్షం వారికి దక్కే అంతే కీలకమైన పదవి ‘పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి’ మాత్రమే! జగన్ తనకు సమీప బంధువు, సీనియర్ నేత అయిన భూమా నాగిరెడ్డిని ఆ పదవిలో నియమించారు. అయితే ఆయన కూతురుతో సహా.. తెదేపాలో చేరిపోవడంతో.. ఆ పదవిలో మరొకరిని నియమించే అవకావం జగన్‌కు వచ్చింది.
పీఏసీ ఛైర్మన్ అనేది కేబినెట్ మంత్రులతో సమానంగా.. ప్రభుత్వంలో చాలా కీలకమైన స్థానం కావడంతో.. ఈ పదవి మీద వైకాపాలోని సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మందే ఆశలు పెంచుకున్నారు. పార్టీ సీనియర్లు జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమరనాధరెడ్డి తదితరులు అడిగినట్లుగా పుకార్లు వచ్చాయి. ప్రకాశం జిల్లాకుచెందిన గొట్టిపాటి రవికుమార్ ఈ పదవి ఇస్తే పార్టీలో ఉంటానంటూ.. ‘ఇవ్వకపోతే తెదేపాలోకి పోతా…’ అనే సంకేతాలతో బ్లాక్మెయిల్చేసినట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే జగన్ వీరందరినీ పక్కన పెట్టి కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ను పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేశారు.
బుగ్గన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే శాసనసభలో చాలా లాజికల్‌గా, సర్కాస్టిగ్గా మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని వారిని ఇరుకున పెట్టగల తెలివైన ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవలి పరిణామాల్లో.. కర్నూలు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో రాజేంద్రనాధ్ కూడా అదే బాటలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఆయనకు అనూహ్యంగా ఇప్పుడు పీఏసీ పదవి దక్కింది. అయితే ఈ నిర్ణయం ద్వారా జగన్.. పార్టీలో చాలా మంది సీనియర్లకు అసంతృప్తి కలిగించారనే అభిప్రాయం వినిపిస్తోంది.