కియా పరిశ్రమ తమిళనాడుకు వెళ్లిపోతుందంటూ.. అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఏపీలో కలకలం బయలు దేరింది. దీంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి.. కియా ఎక్కడకూ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. 14 వేల కోట్లతో కియా ప్లాంట్ పెట్టారని … వారి ప్లాంట్ విస్తరణకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. అయితే అదే సమయంలో.. ఆయన పారిశ్రామిక రాయితీలపై…మాట్లాడటం విశేషం. టీడీపీ ప్రభుత్వం పరిశ్రమలకు రూ.3500 కోట్ల రాయితీలు చెల్లించలేదని ఆరోపించారు.
కియాకు ఇస్తామన్న పారిశ్రామిక రాయితీల విషయంలో ఏపీ సర్కార్.. అంటీ ముట్టనట్లుగా ఉండటంతోనే…ఆ సంస్థ అసంతృప్తికి గురైందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. ప్లాంట్ తరలింపు గురించి చర్చ జరుగుతున్న సమయంలో… పారిశ్రామిక రాయితీలు భారమన్నట్లుగా బుగ్గన మాట్లాడారు. అదే సమయంలో…కియా ప్లాంట్ విలువను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా 1250 కంపెనీలకు భూములు కేటాయించామని.. అవన్నీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయన్నారు.
చిన్న విషయానికే భారీ పబ్లిసిటీ చేసుకనే ప్రభుత్వం 1250 కంపెనీలకు భూములిస్తే.. ఎందుకు చెప్పుకోలేదంటే.. బుగ్గన విచిత్రమైన లాజిక్ ను వినిపించారు. గత ప్రభుత్వం మాదిరిగా మేం అనవసర ప్రచారం చేసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం లో ప్రొఫైల్‌గా చేయాల్సింది చేస్తోందన్నారు. ప్రభుత్వం.. పెట్టుబడుల పేరుతో ఎవరు వచ్చినా కలిసినా.. భారీ హడావుడి చేస్తోంది. కానీ 1250 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని..వాటికి భూములు కేటాయించారని కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ కంపెనీల చిట్టా బయట పెట్టాలన్న డిమాండ్ వినిపించే అవకాశం ఉంది.