ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో ఎక్కడా లేనంత సృజనాత్మకత చూపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయానికి మాత్రమే ప్రత్యేక బడ్జెట్ పేరుతో లెక్కలు వేరు చేసి చూపించింది. కానీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలోని ఆర్థిక శాఖ.. మరింత ఎక్కువ క్రియేటివిటీ చూపిస్తోంది. కొద్ది రోజుల కిందట.. మహిళలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించిన సీఎం జగన్.. ఆ మేరకు లెక్కలు రెడీ చేశారు. కానీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించకపోవడంతో ప్రవేశపెట్టలేకపోయారు. ఇప్పుడు ఒక్క రోజు సమావేశంలో పిల్లలకు కూడా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు లెక్కలు కూడా రెడీ చేశారు.
వ్యవసాయానికి అయినా.. మహిళలకు అయినా.. పిల్లలకు అయినా ప్రత్యేక బడ్జెట్ అంటే.. అసలు బడ్జెట్లో ఎవరికి ఎంత కేటాయిస్తున్నారో.. ప్రత్యేకంగా చెప్పడం తప్ప.. స్పెషల్ కేటాయింపులు కాదు. ఇప్పటి ప్రభుత్వానికి అయితే.. ఈ లెక్కల్లో మరీ ప్రత్యేకత ఉంది. పథకాల పేరుతో నగదు బదిలీ చేస్తున్న వాటినే.. అన్ని కేటగరీల్లోనూ చూపిస్తోంది. ఉదాహరణకు అమ్మఒడి పథకం కింద నగదు బదిలీ చేసే నిధులను… ఎన్ని వర్గాలకు పంపిణీ చేశారో అన్న వర్గాల కార్పొరేషన్ల ఖాతాలో చూపిస్తారు. అమ్మల ఖాతాల్లో వేస్తారు కాబట్టి మహిళా బడ్జెట్లో చూపిస్తారు. ఇప్పుడు పిల్లల బడ్జెట్ అంటున్నారు కాబట్టి… పిల్లల ఖాతాలోనూ చూపిస్తారు. అంటే.. ఒక్క పథకాన్ని మూడు బడ్జెట్లలో చూపించి.. అందరికీ ఇంత ఇంతిస్తున్నామని ప్రచారం చేసుకుని .. సంతోషపడి.. సంతోష పెట్టే ప్రక్రియ అన్నమాట.
దాదాపుగా అన్ని పథకాలూ అంతే. బోలెడన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ వాటికి ఒక్క రూపాయి కేటాయించలేదు. కానీ పద్దుల్లో మాత్రం పధకాల నగదు బదిలీ అంతా.. ఆయా కార్పొరేషన్ల ద్వారానే సాగినట్లుగా జీవోలు జారీ చేస్తూ ఉంటారు. మహిళల కోసమూ అంతే. మొత్తానికి పిల్లల కోసం ఎంత ఖర్చు పెడుతున్నామో వివరిస్తూ.. ప్రత్యేకంగా బడ్జెట్ ప్రకటించింది.. తర్వాత బాలల దినోత్సవం రోజునో.. లేకపోతే.. అవసరమైన రోజునో… ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చుకోవడానికి ఓ టూల్లాగా ఉపయోగపడటానికి దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ.. పిల్లల అభివృద్ధికి.. యువత ఉపాధికి ఊతమిచ్చే కార్యక్రమాలేమీ చేపట్టకుండా… ఏపీ సర్కార్ చిన్నారుల భవితను నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నా… తన క్రియేటివిటీ మేరకు తాను పని చేసుకుంటోంది.