కిందపడినా పైచేయి మాదేనని చెప్పుకునేందుకు వైసీపీ నేతలు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. కేంద్రానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లేఖ రాసిన తర్వాత వేగంగా పరిణామాలు మారుతున్నప్పటికీ.. ఆ టాపిక్‌ను మరింత క్లిష్టం చేయడానికే వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి.. ఎస్ఈసీకి మరోసారి రాజకీయ ఉద్దేశాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఎస్ఈసీ.. కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ రాజకీయ పార్టీ రాసినట్లుగా ఉందని ఆరోపించారు. కడప జిల్లాలో టీడీపీకి ఒక్క స్థానం కూడా లేదని.. అలాంటి చోట.. వైసీపీ బలం ఏమిటో తెలియదా అని.. బుగ్గన ప్రశ్నించేశారు. ఏ రాజకీయ పార్టీకి ఎంత బలం ఉందో..అంచనా వేసుకోవడం..ఎస్ఈసీ పని కాదని బుగ్గన గుర్తించలేకపోయారు.
అక్కడ ఏకగ్రీవాలు అసాధారణం అయ్యాయని.. గతంతో పోల్చి ఎస్ఈసీ లేఖ రాశారు. దీన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. మరో విధంగా విశ్లేషించారు. అంతే కాదు.. తన నియోజకవర్గం డోన్‌లో.. టీడీపీ ఎన్నికల బరి నుంచి వైదొలిగింది. దీన్ని ప్రస్తావిస్తూ… చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని బుగ్గన తప్పు పట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయో.. చంద్రబాబుకు తెలియదా..అని బుగ్గన ప్రశ్నించారు. బహుశా.. బుగ్గన ఉద్దేశంలో పోలీసుల్ని ఉపయోగించి.. బెదిరించి.. ఏకగ్రీవాలు చేసుకోవడం సహజమని.. బుగ్గన అంటున్నట్లుగా ఉన్నారు.
కరోనా వల్ల లాక్ డౌన్ అయ్యే పరిస్థితులు ఏర్పడినా.. ఏపీలో నిర్బంధాలు అమలు చేస్తున్నా… ఎన్నికల వాయిదాను.. ఇప్పటికీ.. బుగ్గన తప్పు పడుతున్నారు. ఎవరిని సంప్రదించి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అప్పటికీ జాతీయ విపత్తుగా ప్రకటించిన తర్వాత కేంద్ర అధికారులను.. సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఎస్ఈసీ చెబుతున్నారు. అయినప్పటికీ.. ఎస్ఈసీపై .. తన సామాజికవర్గ పరమైన దాడితో.. ఎన్నికల వాయిదాను తప్పుపట్టాలనే తమ విధానాన్ని వైసీపీ కంటిన్యూ చేస్తోంది.