రూ. 41 వేల కోట్లకు బిల్లులు లేకుండా చెల్లించారన్న ఆరోపణలు ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే అది గందరగోళంగా ఉంది. ఏదో జరిగిందన్న అభిప్రాయం బలపరిచేలా ఉండటంతో.. మరోసారి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆ రూ. 41వేల కోట్ల విషయంలో ఏం జరిగిందో ఆయన చెప్పలేదు.. రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కదా.. చూసుకుంటాయి.. టీడీపీ ఎందుకు విమర్శలు చేస్తోందని ఆయన ఎదురుదాడి చేస్తున్నారు.
మొత్తం వ్యవహారం సీఎంఎఫ్ఎస్ వ్యవస్థ వల్ల జరిగిందని..ఆ వ్యవస్థ తీసుకొచ్చింది చంద్రబాబు కాబట్టి.. తప్పంతా చంద్రబాబుదే అన్నట్లుగా ఆయన చెప్పికొచ్చి అందర్నీ మరోసారి ఆశ్చర్యపరిచారు. రాజ్యాంగ వ్యవస్థ అయిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నే రూ. 41వేల కోట్లకు లెక్కలు.. బిల్లులు చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ లేఖనే.. పయ్యావుల కేశవ్ గవర్నర్‌కు కూడా సమర్పించారు. ఆ తర్వాత పరిమితికి మించి తీసుకున్న అప్పుల గురించి కేంద్రం రాసిన లేఖ గురించి కూడా బయటపెట్టారు. ఈ క్రమంలో బుగ్గన.. ఆడిటింగ్ సంస్థ అయిన కాగ్‌కు తాము లెక్కలు చెబుతామని చెప్పుకొచ్చారు.
అనవసర ఆరోపణలు చేసి.. ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు రెకెత్తిస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా రూ. 41వేల కోట్ల మిస్టరీ అంతకంతకూ పెరుగుతోంది. అనుమానాలను పెంచేలాగానే ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు వస్తున్నాయి కానీ.. క్లారిటీ ఇచ్చేలా లేవు. సీఎంఎఫ్ఎస్ వ్యవస్థ వల్ల దజరిగిందని.. అది చంద్రబాబు తెచ్చారని.. ఆ వ్యవస్థపై తప్పు నెట్టే ప్రయత్నం చేయడం ద్వారా.. ఏదో జరిగిందన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. తమ తప్పేమీ లేదని తప్పించుకునే ప్రయత్నం ప్రారంభించారన్న అనుమానాలు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.