ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చే నెలకు ఖర్చులకు సర్దుబాటు చేయడానికి ఇప్పటి నుండి ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు రోజుల నుండి ఢిల్లీలో మకాం వేసి అదనపు అప్పులకు పర్మిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ వరకూ ఆర్బీఐ వద్ద బాండ్ల వేలంద్వారా తీసుకోగలిగిన రుణం కేవలం రూ. 150 కోట్లు మాత్రమేఉంది. కానీ రెండు నెలలు గడవాలంటే మరో రూ. పదివేల కోట్ల అప్పు కావాలి. తాము అన్ని సంస్కరణలు అమలు చేస్తున్నామని అప్పు తీసుకునేందుకు పరిమితి పెంచాలని కోరుతూ బుగ్గన ఢిల్లీలో వాలిపోయారు.
ఆయన వెంట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ కూడా ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో అదే పనిగా చర్చలు జరుపుతున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశమయ్యారు. ఈ నెలలో ఇప్పటికే కొన్ని అప్పులు తిరిగి చెల్లించడానికి అవసరమైన నిధులు లేవు. ఈ నెలలో అప్పులు పుట్టకపోతే వచ్చే నెలలో జీతాలు, పెన్షన్లకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. బ్యాంకుల నుంచి తీసుకునే విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఆర్బీఐ బాండ్ల ద్వారా నమ్మకంగా అప్పులు వస్తాయి. అందుకే అదనపు రుణం పర్మిషన్ కోసం బుగ్గన గతంలో చేసినట్లుగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రం ఏపీ ప్రభుత్వం పట్ల మొదటి నుంచి సానుకూలంగానే ఉంది. అప్పులపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అదనపు రుణం కోసం పర్మిషన్ ఇస్తారన్న నమ్మకంతోనే ఉన్నారు.