రియల్ ఎస్టేట్ ప్రపంచంలో అడ్వాన్సులు ఇచ్చి కూడా కొనుగోలు వరకూ వెళ్లని ఎన్నో ఘటనలు ఉంటాయి. ఇలాంటి చోట్ల ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి ఇవ్వబోమని బిల్డర్లు బెదిరిస్తూ ఉంటారు. ఏం చేయాలో తెలియక తాము కట్టిన అడ్వాన్సుల్ని వదిలేసుకుంటూ ఉంటారు కొనుగోలుదారులు. అయితే పది శాతానికి మించి బిల్డర్లు ఇలా బయానాగా తీసుకున్న మొత్తాన్ని మినహాయించుకోవడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది.
కొనుగోలుదారు తన కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే బేస్ ప్రైస్ సేల్లో 10 శాతానికి మించి బిల్డర్ వసూలు చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. గుర్గావ్ గోద్రేజ్ సమ్మిట్ ప్రాజెక్టులో ఓ కొనుగోలుదారు ఫ్లాట్ బుక్ చేసుకుని దానికి సంబంధించిన మొత్తం చెల్లించారు. ఫ్లాట్ అప్పగించే సమయంలో నిర్మాణ క్వాలిటీపై సంతృప్తి చెందని కొనుగోలు దారు తనకు ఫ్లాట్ వద్దని.. తన డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరాడు. అయితే గోద్రేజ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 20 శాతం మొత్తాన్ని మినహాయించుకుంటామని దానికి అంగీకరించాలని షరతు పెట్టింది.
కొనుగోలుదారు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ లోకేష్ వేశారు. పది శాతం మినహాయించుకుని మిగిలిన సొమ్ముు చెల్లించాలని ఆసంస్థ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని గోద్రెజ్ ప్రాపర్టీస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కొనుగోలును రద్దు చేసుకుంటే 20 శాతం మొత్తాన్ని మినహాయించుకుంటామనే నిబంధన అమ్మకపు ఒప్పందంలో ఉందని.. అందువల్ల తమ నిర్ణయం సబబేనని వాదించింది. కానీ ఒప్పందం అనేది ఏకపక్షంగా ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమ్మకపు ధరలో 10 శాతం మొత్తం మినహాయించుకోవడమే సబబు అని.. అంతకు మించి మినహాయించుకోవడానికి వీలు లేదని ఆదేశించింది.
అంటే ఉద్దేశపూర్వకంగా ఒప్పందంలో ఎంత శాతం రాసినా రియల్ ఎస్టేట్ సంస్థలు పది శాతం కన్నా ఎక్కువ మినహాయించుకోవడానికి అవకాశం లేదు. కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకున్నప్పుడే ఇది వర్తిస్తుంది.