ఇది హైపర్ దేశభక్తి కాలం. కాదంటే దేశద్రోహం ముద్రవేసి వేటాడే సంఘ పరివారం.ఆపైన ఆంధ్ర ప్రదేశ్కు వరప్రసాదంగా అభివర్ణించబడే నవ్యాంధ్ర భోజుడి వంటి చంద్రప్రభువుల పాలన. అలనాటి అపురూప నగరం అమరావతిని నూతనరాజధానిగా పునర్వైభవం తెచ్చే పనిలో ఆయన వుంటే వియ్యంక బావ నందమూరి పుత్రుడు ఆ శాతకర్ణిని తెరపై చూపే పనిలో నిర్విరామంగా శ్రమిస్తున్నారు. మరోవైపున హైటెక్ అవతారంలో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు తానెంత విజనరీనో సైబర్ సిటీని ఎలా నిర్మించానో అహౌరాత్రులు అదరహౌ అనేట్టు చెబుతూనే వున్నారు. అంతా బాగానే వుంది కాని బాసూ.. ఒక్క చిన్న తిరకాసు. ఇంత హైపర్ దేశ రాష్ట్ర భక్త పాలకుడికి మన దేశంలోని సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల సమర్థతపై మాత్రం నమ్మకం లేదు. మనం కడితే మురికివాడలేనని పదేపదే అవమానకరంగా మాట్టాడుతున్నారు.ఆగేయాసియాలోని బుల్లిబుల్లి దేశాలు అఖండ అమరావతి శోభను ఆధునిక భారత స్వప్నాన్ని ఆవిష్కరిస్తాయని నమ్మమంటున్నారు. ఒక ముఖ్యమంత్రి అందులోనూ పదేళ్ల అనుభవంతో పండిపోయిన రాజకీయ వేత్త ఇంత అసంబద్దంగా అభ్యంతరకరంగా మాట్లాడ్డం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. గతసారి అన్నప్పుడు వచ్చిన విమర్శల తర్వాతైనా సర్దుకోకపోగా సమర్థించుకోవడానికి మరోసారి అదే అంటూ కావాలని వివాదం సృష్టిస్తున్నారు.హరప్పా మొహంజదారో కాలంలోనే పట్టన నాగరికతకు పేరు పొందిన ఈ దేశ చరిత్రను వదిలేద్దాం. చేతుల్లో మంత్రశక్తి మేధలో మహా ప్రతిభ ఇమిడిన నిపుణులను వదిలేద్దాం. ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమైన కార్పొరేట్ జగతిలో జిఎంఆర్, జివికె వంటివి దేశ దేశాలలో మహా నిర్మాణాలు చేసి అహా అనిపించుకున్నాయే! నిజంగా ఈ మాటలు దేశానికి అవమానం కాదా? ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్న పారిశ్రామిక వేత్తలకు నిర్మాణ వ్యాపారులకు పరువు తక్కువ కాదా? ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు గాని మన దేశంలోనే మనను చులకన చేస్తే ఏమనాలి?