బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇష్టారీతిన కూల్చివేతలు జరుగుతున్నాయి. బుల్డోజర్ పాలన సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపై బుల్డోజర్లతో విరుచుకుపడే కొత్త సంప్రదాయాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఎప్పుడో నోటీసులు ఇచ్చామన్న పాత కాగితాలను సృష్టించి తెల్లవారు జామున మూడు గంటలకు ఇంటిపైకి బుల్డోజర్తో వెళ్లడమనే ఊహే సామాన్యంగా ఎవరికీ రాదు. కానీ ప్రభుత్వ పెద్దలకు వచ్చింది. పై స్థాయిలో వారు చెబితే తప్ప అధికారులు ఇలా చేయరు. ఓ బలమైన ప్రతిపక్ష నేత ఇంటిని కూల్చివేయాలంటే.. పై స్థాయి అనుమతులు ఉండాలి.
ఖచ్చితంగా ఇది ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయమే. కూల్చివేయాలన్న కుట్రతోనే ఇలా చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజంగా అక్కడ ఆక్రమణ ఉందా.. ఉంటే ఎంత ఉంది.. ఇలాంటి వివరాలేమీ లేవు. రెండు సెంట్లు అని ఒక సారి చెబుతారు.. 0.2 సెంట్లు అని మరోసారి చెబుతారు. ఎంత ఆక్రమణ ఉందో ఎప్పుడు సర్వే చేశారో తెలియదు. సర్వే చేసి. నోటీసులు ఇచ్చి.. తొలగించడానికి వారికి సమయం ఇవ్వడం చట్టం. కానీ అలా చేయకుండా ఇవ్వని నోటీసులను పాత తేదీలతో సృష్టించుకుని వచ్చి కూల్చివేతలకు పాల్పడటం అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే.
చట్ట విరుద్ధమైన కూల్చివేతలు జరిగితే తీవ్రంగా పరిగణిస్తమని సుప్రీంకోర్టు ఓ వైపు హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థులు.. వర్గ శత్రువులపై బుల్డోజర్లతో వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో పాలనపై ప్రజల్లోనూ భయం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం అంటే భయపెట్టి పాలన చేయాలి.. ఎవరూ నోరెత్తకూడదు.. ఎవరైనా నోరెత్తితే బుల్డోజర్ వస్తుందన్న ఆలోచనతో పాలన సాగించాలన్న వ్యూహం కనిపిస్తున్నట్లుగా ఉంది.
అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఉన్నంత వరకూ భయపడతారేమో.. రేపు పాలకుల్ని ఎంపిక చేయాలనుకున్నప్పుడు… ఓటు అనే వజ్రాయుధం వాళ్ల దగ్గర ఉంటుంది. దాంతో వారు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. ఆ విషయం గుర్తు పెట్టుకోడం ప్రజాస్వామ్యంలో రాజకీయం చేసేవాళ్లకు ప్రధానంగా ఉండాల్సిన లక్షణం.