కారును పోలి ఉండే గుర్తుల వల్ల పెద్ద ఎత్తున ఓట్లను కోల్పోతున్నామంటూ టీఆర్ఎస్ లెక్కలతో సహా ఈసీకి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినా ఫలితం రాలేదు. దీంతో మునుగోడులోనూ మరోసారి టీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవనున్నాయి. కారు గుర్తును పోలి ఉన్న డోజర్, రోడ్డు రోలర్లను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేశారు. వాటిని కేటాయించకుండా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆ గుర్తులు బ్యాలెట్లో ఉండనున్నాయి. ఈ రెండింటితో పాటు మరో ఆరు గుర్తులను వద్దని టీఆర్ఎస్ చెబుతోంది.
వాటి వల్ల గతంలో తమకు జరిగిన నష్టమేంటో కూడా చెప్పారు. 2018లో రోడ్డు రోలర్ గుర్తుకు జహీరాబాద్‌లో ఏకంగా 4330 ఓట్లు వచ్చాయి. డోర్నకల్‌లో రోడ్డురోలర్‌కు 4,117 ఓట్లు , మునుగోడులో రోడ్డు రోలర్‌కు 3,569 ఓట్లు వచ్చాయి. దీనికి కారణం రోడ్ రోలర్ గుర్తు కారును పోలి ఉండటమే. మరికొన్ని చోట్ల ఇదే కారణంగా కెమెరాకు 3 వేల నుంచి 9 వేల ఓట్లు.. టీవీకి 2 వేల నుంచి 3 వేల ఓట్లు వచ్చాయి. కారును పోలిన ఎన్నికల గుర్తులను కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయగా, నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఇంత దూరం వచ్చాక జోక్యం చేసుకోలమని స్పష్టం చేసింది.
ఈవీఎంలో స్టాంప్ పరిమాణంలో ఉండే కారును పోలిన గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడతారని, రోడ్ రోలర్ గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ 2011లో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆ గుర్తును కేటాయించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం జరిగినా.. మొత్తంగా బరిలో టీఆర్ఎస్కు పోటీగా బుల్ డోజర్, రోడ్డు రోలర్ గుర్తులు ఈవీఎంలో ఉండనున్నాయి. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో వారి గుర్తులు ఎక్కడో అడుగున ఉంటాయి కాబట్టి సమస్య ఉండదని అంచనా వేస్తున్నారు.