ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్ట్ అయిన ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రతిపాదనల్లో తొలి అడుగు పడింది. ప్రపంచానికి బుల్లెట్ రైళ్లను పరిచయం చేసిన జపాన్ కు ఈ ప్రాజెక్టును అప్పగించడానికి కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. 98 వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
తొలి అడుగు పడేటప్పుడే సాధకబాధకాలను పరిశీలించాలి. ఒకప్పుడు ఆర్థిక రంగంలో డ్రాగన్ గా వెలుగొంది చైనా ఇప్పుడు దిగాలుపడుతోంది. జపాన్ ను అధిగమించి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా ఇప్పుడు కొంత మేరకు దివాళా తీయడానికి కారణం ఈ బుల్లెట్ రైళ్లే. హైస్పీడ్ రైళ్లలో చరిత్ర సృష్టించాలని చైనా ఆరాట పడింది. దేశంలో మూలమూలలా బుల్లెట్ రైళ్లను వేయడానికి, ట్రాక్ నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. తీరా ఆ రైళ్లలో రోజుకు పట్టుమని వంద మంది కూడా ఎక్కడం లేదు. అందుకే చైనా ఆర్థికంగా పతనమైంది. ఇప్పుడు వృద్ధి రేటులో మనకంటే వెనుకబడి పోయింది.
చైనా పాఠం మనకు ఓ గుణపాఠం అవుతుందేమో ఆలోచించాలి. అసలు ఈ రైలు వల్ల అదనంగా సాధించేది ఎంత, అందుకు ఖర్చయ్యేది ఎంత, తిరిగి రాబట్టుకునేది ఎంత అనే లెక్కలు పక్కాగా వేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే అది ప్రజల సొమ్ము.
వాస్తవిక దృష్టితో ఆలోచిస్తే, కేవలం 505 కిలోమీటర్ల దూరం బుల్లెట్ రైలు కోసం 98 వేల కోట్లు ఖర్చు పెట్టడం వృథా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి 7 గంటల సమయం పడుతోంది. అత్యాధునిక లోకోమోటివ్ టెక్నాలజీ ద్వారా ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించుకోవచ్చు. బుల్లెట్ రైలు వస్తే రెండు మూడు గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చట. అలాంటి రైలులో చార్జీలు భారీగా ఉంటాయి. కాబట్టి అందులో ప్రయాణించేది ఎవరు? సామాన్యులు కాదు. కచ్చితంగా సంపన్నులే. వారు అంత అర్జెంటు పని ఉంటే విమానంలో పోగలిగే స్తోమత ఉన్న వారే.
ఈ రైలులో మహా అయితే 700 నుంచి 1000 మంది వరకు ప్రయాణిస్తారు. ఇప్పటికే ఉన్న రైళ్లలో సదుపాయాలు మెరుగుపరిచి, వాటి వేగాన్ని పెంచడం ద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గించవచ్చు. 98 వేల కోట్లంటే మాటలు కాదు. రైళ్ల భద్రత కోసం ఆధునిక ఏర్పాట్లు చేయడం, ట్రాక్ ను నవీకరించడం, కొత్త ట్రాక్ నిర్మాణం, లెవెల్ క్రాసింగ్ ల వద్ద కాపలా పెట్టడం, మహిళల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటి ఎన్నో పనులను చేయడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలాంటిది, ఒక్క రైలు, దాని మార్గం కోసం సుమారు లక్ష కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడం సబబేనా అనేది మోడీ ప్రభుత్వం మరోసారి ఆలోచించడం మంచిది.