తెలంగాణ సీఎం కేసీఆర్ను జైలుకు పంపుడు ఖాయమని గతంలో జోరుగా ప్రకటనలు చేసిన బండి సంజయ్.. ఆ తరవాత మారిన రాజకీయ పరిస్థితుల్లో సైలెంటయ్యారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాలు రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన మళ్లీ కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయమని కొత్తగా ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాల్లో వచ్చిన ఆ మార్పు… ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడమే. వారంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారని చెప్పిన ఆయన… గత వారం రోజులుగా.. కేసీఆర్పై ఉన్న కేసులను బయటకు తీయడానికే ప్రత్యేకంగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు.
కేసీఆర్తో పాటు మొత్తం పద్దెనిమిది మంది ముఖ్య నేతల అవినీతికి ఆధారాలు సేకరించి.. లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నామని.. కేసీఆర్పై ఉన్న సహారా, ఈఎస్ఐ స్కాంల కేసులను కూడా… మదింపు చేశామన్నారు. వాటిని చూసిన తర్వాతే… కేసీఆర్ ఎంత పెద్ద అవినీతి పరుడో తేలిందని.. బండి సంజయ్ చెబుతున్నారు. బండి సంజయ్ మాటల్లో మళ్లీ పదును రావడానికి కారణం… తర్వాత కూడా టీఆర్ఎస్తో ఎలాంటి బంధాలు ఉండవని.. నిరూపించాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణ బీజేపీపై పడటమే కారణం. ఈటల బీజేపీ వైపు చూడటంతో… పలువురు టీఆర్ఎస్ అసంతృప్తవాదులు.. బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. వారందరి అనుమానం ఒకటే… తర్వాత బీజేపీ.. టీఆర్ఎస్ కలిస్తే తమ పరిస్థితేమిటన్నదే. అందుకే.. ఎప్పుడూ బీజేపీ- టీఆర్ఎస్ కలవవు అని చెప్పడానికి బండి సంజయ్ కొత్తగా కేసీఆర్ జైలు వాదన తీసుకొచ్చినట్లుగా భావిస్తున్నారు.
అయితే.. బండిసంజయ్ గతంలోనూ ఇలాంటి మాటలు మాట్లాడారు. కేసీఆర్ వెళ్లి బీజేపీపెద్దలతో సమావేశం అయి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. సైలెంటయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్లు.. బండి సంజయ్ మాటలు వ్యక్తిగతం అన్నట్లుగా తీసి పడేశారు. దాతో రెండు పార్టీల మధ్య ప్యాచప్ అయిందనుకున్నారు. కానీ ఇప్పుడు… మళ్లీ కేసీఆర్ను సహించే పరిస్థితి లేదని… చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కానీ… మాటలు చెబితేనే ఇప్పుడు… బీజేపీలో చేరాలనుకుంటున్న కేసీఆర్ వ్యతిరేకులు నమ్మే పరిస్థితి లేదు. ఏదో ఓ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీబీఐ, ఈడీ రంగంలోకి దిగి.. కొన్ని సోదాలు.. కొన్ని కేసులు నమోదు చేస్తే.. బీజేపీకి అనుకున్నంత ఊపు వస్తుందని… కొంత మంది చెబుతున్నారు. మరి ఈ విషయంలో బీజేపీ నేతలు ముందడుగు వేస్తారో లేక.. మాటలతోనే సరిపెడతారో వేచి చూడాలి..!