ప్రగతి భవన్‌ను కూల్చి వేసి ఆ స్థానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే ఎలా ఉంటుంది..?. టీఆర్ఎస్ నేతలకేమో కానీ.. ఇలాంటి ఆలోచనే బీజేపీ నేతలకు ఉత్సాహం తెచ్చి పెడుతుంది. “దళిత బంధు” పేరుతో కేసీఆర్ చేస్తున్న రాజకీయానికి ఇదే సరైన కౌంటర్ అని అనుకుంటారు. అందుకే ఈ రాజకీయాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని.. అందుకే… ప్రగతి భవనాన్ని కూల్చి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత లక్ష నాగళ్లతో కేసీఆర్ ఫామ్ హౌస్‌ను దున్నేసి బడుగులకు పంచుతామని కూడా హామీ ఇచ్చారు.
అంతే కాదు.. దళిత కుటుంబానికి రూ. పది లక్షలు చాలా చిన్న మొత్తమని రూ. యాబై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారణమేమిటో కానీ బండి సంజయ్ ఇటీవలి కాలంలో జోరు తగ్గించారు. విమర్శలఘాటు తగ్గించారు. అయితే ఇప్పుడు వరుసగా బీజేపీ నేతలు టీఆర్ఎస్లో చేరుతూండటంతో మళ్లీ టోన్ పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది. ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన గతంలో ఎక్కువగా కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడేవారు. కేసీఆర్‌ను జైలుకు పంపుతామని చెబుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు అవినీతి.. కేసీఆర్ జైలు గురించి పెద్దగా మాట్లాడటం లేదు.
రాజకీయ విమర్శలు తగ్గించారు. దీంతో బండి సంజయ్ జోరు తగ్గించారన్న ప్రచారం జరిగింది. కానీ .. తాను రేసులోనే ఉన్నానని నిరూపించుకునేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని అప్పుడప్పుడు.. ఏదో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నిరూపిస్తూ ఉంటారు. కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయాలు… తెలంగాణ బీజే్పీలో పెరిగిన కిషన్ రెడ్డి ప్రాబల్యం అన్నీ కలిపి బండి సంజయ్‌కు కాలం కలసి రాని పరిస్థితి ఏర్పడింది.