కథలు రాసుకోవడం కంటే కాంబినేషన్లు సెట్ చేసుకోవడానికే మేకర్స్ ఎక్కువగా కష్టపడుతున్న కాలం ఇది. ముఖ్యంగా హీరోల పక్కన హీరోయిన్లను వెదికి పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. స్టార్ హీరోలకు సైతం ఈ ఇబ్బంది తప్పడం లేదు. తమ ఇమేజ్‌కీ, క్రేజ్కీ తగిన కథానాయికల్ని ప్రాజెక్ట్‌లోకి తీసుకురావడం చాలా పెద్ద టాస్క్ గా మారిపోయింది. స్టార్ హీరోయిన్లెవరూ ఖాళీగా ఉండరు… కొత్త వాళ్లు సరిపోరు.. దాంతో పాటు ఫ్యాన్స్ మనోభావాల్నీ, వాళ్ల ఇష్టాల్ని సైతం పరిగణలోనికి తీసుకోవాల్సివస్తోంది. ఇన్ని సమీకరణాల మధ్య హీరోయిన్లని వెదికి పట్టుకోవడం మామూలు విషయం కాదు.
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఫిక్సయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. మృణాల్ కూడా ఓ ఇంటర్వ్యూలో బన్నీ సినిమాలో ఆఫర్ వచ్చిందని, అయితే అదింకా డిస్కర్షన్ స్థాయిలోనే ఉందని చెప్పారు. దీన్ని బట్టి అట్లీ సినిమాలో మృణాల్ కనిపించడం దాదాపు ఖాయం అనుకొంటున్నారంతా.
అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం మృణాల్ ఎంపిక విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్నారు. బన్నీ పక్కన మృణాల్ సరిపోదని, తను ఎప్పుడూ ఒకే ఎక్స్ప్రెషన్ తో నెట్టుకు వస్తుందని, మరో హీరోయిన్ని చూడమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘సీతారామం’ లాంటి సూపర్ హిట్ సినిమా మృణాల్ ఖాతాలో వుంది. హాయ్ నాన్న కూడా మంచి సినిమానే. కాకపోతే… బన్నీ ఫ్యాన్స్‌కి ఇంకేదో కావాలి. అందుకే… మృణాల్ వద్దుబాబోయ్ అంటూ గోల చేస్తున్నారు. మరి వాళ్ల విన్నపాలు మేకర్స్ వరకూ చేరతాయో లేదో చూడాలి.