“రికార్డులు ముఖ్యం కాదు
ప్రేక్షకుల చప్పట్లు ముఖ్యం!”
– చాలాసార్లు, చాలా సందర్భాల్లో, చాలామంది హీరోలు చెప్పే మాట. చాలా మామూలు మాట. అతి సాధారణమైన మాట. ఏ టాప్ హీరో రికార్డు సాధించినా ‘మేం వాటికి అస్సలు ప్రాధాన్యం ఇవ్వం’ అన్నట్టే చెబుతారు. కానీ.. అది కూడా వాళ్ల పెదాల నుంచి వచ్చే మాటే సుమా. మనసులో మాత్రం అంకెలు కావాలి. రికార్డులు కావాలి. గతంలో ఎవరి రికార్డు చెరిపేశాం?, ఎన్ని అంకెల్ని కాళ్లక్రింద తొక్కేశాం.. అనే తృప్తి కావాలి. కాకపోతే ఇప్పుడు మనసులోకి మాటలు బయటకు వచ్చేస్తున్నాయి. మాకు రికార్డులు కావాల్సిందే అని బాహాటంగానే అంటున్నారు హీరోలు. అల్లు అర్జున్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఈ సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ సూపర్ హిట్. మామూలు సూపర్ హిట్ కాదు. రికార్డులన్నీ తిరగరాసే హిట్టు. ఓ గట్టిపోటీని (సరిలేరు నీకెవ్వరు)ని తట్టుకుని నిలబడి జెండా ఎగరేసిన సినిమా ఇది. అందుకే ‘నాన్ బాహుబలి 2 రికార్డు’ అంటూ సగర్వంగా చిత్రబృందం ప్రకటించుకుంది. అయితే ఈ మాటలు, అంకెల గారడీలూ పోస్టర్లపై పేరిస్తే చాలు. నిర్మాతలు చెప్పుకుంటే చాలు. హీరో సైతం పదే పదే ‘మాదే రికార్డు మాతోనే రికార్డు’ అని చెప్పుకోవడం చూస్తుంటే ఈ అంకెలపై అల్లు అర్జున్ ఎంత మమకారం పెంచేసుకుంటున్నాడో అర్థం వేస్తుంది. ఈమధ్య ‘అల వైకుంఠపురం’ రికార్డు టీజర్ విడుదలైంది. అందులో ‘హీ ఈజ్ ఏ సన్సేషన్… అడుగుపడ రికార్డులు అదిరిపడ’ అంటూ ఓ రాప్ గీతంతో విడుదల చేశారు. డప్పు కొట్టుకోవడంలో అది పరాకాష్ట.
అల్లు అర్జున్‌కి రికార్డులు కొత్తేమోగానీ, ఇండ్రస్ట్రీకి కాదు. అవి వస్తుంటాయి, పోతుంటాయి. మహేష్ బాబు రెండు సార్లు ఇండ్రస్ట్రీ హిట్టు కొట్టాడు. అది కూడా ఆల్ టైమ్ హిట్. బన్నీ కూడా ఈమధ్యన `ఈ రికార్డుని ఎంత త్వరగా చెరిపేస్తే అంత త్వరగా ఇండ్రస్ట్రీ ముందడుగు వేసినట్టు` అంటూ కాస్త గంభీరమైన కామెంటే చేశాడు. అంటే ఈ అంకెలు శాశ్వతం కాదన్న సంగతి బన్నీకి కూడా తెలుసన్నమాట. మరి ఇంకా వాటిని పట్టుకుని ఎందుకు వేళాడుతున్నాడో అర్థంకాదు. సంక్రాంతి విన్నర్, నాన్ బాహుబలి 2 రికార్డు బ్రేక్ లాంటి పోస్టర్లు, టీజర్లో సొంత డబ్బాలూ ఎందుకో..? ఇది వరకు రంగస్థలంతో ఇలానే రామ్ చరణ్ కూడా అదిరిపోయే హిట్టు అందుకున్నాడు. అది కూడా నాన్ బాహుబలి రికార్డే. కానీ చరణ్ మాత్రం ఇలాంటి హడావుడి చేయలేదు. నా పోస్టరుపై రికార్డుల గోల వద్దు అని గట్టిగా చెప్పాడు. సొంత ఇంట్లోనే అంతటి ఆదర్శం ఉన్నప్పుడు – బన్నీ గుర్తించకపోవడం విడ్డూరం. అంతెందుకు… రికార్డుల రారాజు చిరంజీవినే తీసుకోండి. ఏనాడూ.. ఆయన మైకు పట్టుకుని రికార్డులన్నీ కొట్టేశాను అని చెప్పుకోలేదు. అలాంటి ప్రశ్నలెప్పుడు వచ్చినా – చిన్నగా నవ్వేసి ఊరుకుండేవారు. ‘నాకు చిరంజీవిగారే ఆదర్శం’ అని చెప్పుకునే హీరో – ఆయన మాటల్ని ఎలా విస్మరిస్తున్నాడో..?
ఈ మధ్య బన్నీ – త్రివిక్రమ్‌ల ఇంటర్వ్యూలు జరిగాయి. ఆ ఇంటర్వ్యూలన్నీ ప్రింట్ మీడియాకు ప్రత్యేకం. ఇంటర్వ్యూకి వెళ్లేముందు పాత్రికేయులకు `రికార్డుల గురించి ప్రశ్న తప్పకుండా అడగండి` అంటూ పీఆర్వో టీమ్ నుంచి రిక్వెస్టులు వచ్చాయి. అంటే… రికార్డులు ప్రస్తావనని కావాలని ప్రశ్నగా మార్చి, పదే పదే చెప్పుకోవడం అన్నమాట. ఎందుకీ ఆత్రుత? రికార్డులపై ఎందుకింత మమకారం? అయినా ఇదేమీ ఆల్ టైమ్ రికార్డు కాదే. బాహుబలి 2ని మించిన సినిమా తీసినప్పుడు ఇంతటి సంబరాలు చేసుకోవడంలో ఓ అర్థం ఉంటుంది. నెంబర్ వన్ని ఎవరూ ఢీ కొనలేరు. నెంబర్ 2 స్థానం కోసమా ఇంత తాపత్రయం?
కొన్నాళ్ల క్రితం ఓ ఛానల్‌కి దిల్‌రాజు ఇంటర్వ్యూ ఇస్తూ…. ‘ఈ రికార్డుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిలో చాలా వరకూ ఫేక్ ఉంటాయి. ఎవరు నిజం చెబుతున్నారో తెలుసుకోవడం చాలా కష్టం’ అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నిర్మాతగా చిత్రసీమలో్ని లొసుగులు ఆయనకు బాగా తెలుసు. అందుకే అంత నిర్మొహమాటంగా చెప్పేశాడు. బన్నీకి కూడా వాటి గురించి బాగా తెలుసు. ఇప్పుడు సినిమా హిట్టయ్యింది కాబట్టి, వాళ్లు చెప్పిన అంకెలన్నీ చెల్లుబాటు అవ్వొచ్చు. రేపు మరో సినిమా వస్తుంది. వాళ్లు కూడా ఇలానే ఇష్టమొచ్చిన అంకెలతో రికార్డు మాదే అంటారు కదా?
ఓటమి వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండాలి. అది తప్పదు. విజయం వచ్చినప్పుడు కూడా అలానే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. అది మరింత అవసరం. బన్నీ ఈ విషయం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. రికార్డుల గురించి హీరోలు మాట్లాడుకోకూడదు. అది ఫ్యాన్స్ పని. హీరోలే కాలర్లు ఎగరేసి రికార్డుల ప్రస్తావన తీసుకొస్తుంటే, ఫ్యాన్స్ తగ్గుతారా? వాళ్ల మధ్య గలాటాలకు ఇంతకంటే మరో కారణం కావాలా? అందుకే బన్నీలాంటి హీరోలు ఈ మత్తుని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. వ్యక్తులుగా, హీరోలుగా వాళ్లకూ.. పరిశ్రమకు కూడా.