నంది అవార్డుల్లో మెగా హీరోలకు సముచిత స్థానం దక్కడం లేదని టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. భలే భలే మగాడివోయ్ చిత్రానికి సహ నిర్మాత గా వ్యవహరించిన బన్నీ వాసు మెగా ఫ్యామిలీ కి బాగా క్లోజ్ అన్న విషయం తెలిసిందే.
మగధీర నుంచి మెగా హీరోలకు అన్యాయం జరుగుతోందని, అప్పుడే మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్‌కి సపోర్టింగ్ యాక్టర్ అవార్డు ఇవ్వడం సరికాదని అన్నారు. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, మెగాభిమానుల అభిప్రాయమని ఆయన చెప్పారు. మెగా హీరోలకు ఏపీ రాష్ట్ర అవార్డులు రావాలంటే టీడీపీ ప్రభుత్వం వద్ద శిక్షణ తీసుకోవాలేమో..? అని ఆయన ఎద్దేవా చేస్తూ ఆయన వేసిన ట్వీట్ ఇండస్ట్రీ లో ప్రకంపనలు రేపింది..
అలాగే గత పదిహేనేళ్ళుగా ఇండస్ట్రీ కి 50% పైగా ఆదాయం మెగా ఫ్యామిలీ నుంచే వస్తోందని , ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చే సమయం లో ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. సాధారణంగా అవార్డు రాలేదని ప్రశ్నించడం పెద్ద హీరోల స్థాయి కి చిన్న విషయం కాబట్టి వారెవరూ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. అయితే వారి అభిమానులుగా, వారికి సన్నిహితంగా ఉన్నవారు గొంతెత్తడం మాత్రం తెలుగు ఇండస్ట్రీ లో కొత్త పరిణామమే!