త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు క్లాసే. కిరాయికి మర్డర్లు చేసేవాడినైనా (అతడులో మహేష్ బాబు) త్రివిక్రమ్ క్లాస్‌గానే చూపించాడు. ఆఖరికి ఫ్యాక్షనిస్టు హీరో అయినా (అరవింద సమేతలో ఎన్టీఆర్) క్లాస్ లుక్ వదల్లేదు. అయితే `అల వైకుంఠపురము`లో అల్లు అర్జున్ పాత్రే… అది క్లాసా, మాసా? అనేది తెలియనివ్వకుండా మానేజ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ మిడిల్ క్లాస్ యువకుడిగా పరిచయం చేస్తూ టీజర్ కట్ చేశాడు త్రివిక్రమ్. `గ్యాప్ తీసుకున్నావేంట్రా..` అని తండ్రి అడిగితే `తీసుకోలేదు.. వచ్చింది` అని చెప్పడం బాగా పేలింది. ఆ టీజర్లో బన్నీ లుక్కన్నా, ఇచ్చిన పంచే బాగా క్లిక్ అయ్యింది. టీజర్ వచ్చినప్పుడు ఈ సినిమాలో బన్నీ క్లాసా, మాసా అనే క్వశ్చను రాలేదు. `సామజ వరగమన` అనే మెలోడీ పాట దింపినప్పుడు మాత్రం బన్నీ క్లాస్ అని కన్ఫామ్ అయ్యింది. అయితే ఆ తరవాత దసరాకి మరో లుక్కు విడుదల చేశారు. చున్నీ పట్టుకుని ఫైట్ చేస్తున్న బన్నీని చూస్తే.. క్లాసీ హీరోగానే కనిపించాడు. ఈరోజు మరో సరికొత్త లుక్ వచ్చింది. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో కోడి పుంజు, నోట్లో బీడీ… ఇవన్నీ చూస్తే మాత్రం బన్నీలోని మాస్ యాంగిల్నీ త్రివిక్రమ్ వాడుకుంటున్నాడనిపించింది. ఇది సంక్రాంతి సినిమా. దానికి సింబాలిక్‌గా బన్నీ చేతిలో కోడి పుంజు ప్రత్యక్షమైపోయింది. ఈ సినిమా సంక్రాంతి వస్తుందా, రాదా? రిలీజ్ డేట్ మారుతుందేమో? అని సవాలక్ష అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో `మేం సంక్రాంతికి వస్తున్నాం.. కాచుకోండి` అన్నట్టుగా ఈ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు త్రివిక్రమ్. జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆరోజున చూడాలి.. బన్నీ క్లాసా, మాసా అనేది.