హైటెన్షన్ వైర్లను ఉడుతలు కొరుకుతాయా? సరే కొరికాయే అనుకుందాం.. అవి తెగిపోతాయా ? హైటెన్షన్ వైర్లు తెగిపోయేంతగా ఉడుతలు కొరికేయగలవా ? అంత బలహీనంగా హైటెన్షన్ వైర్లు ఉంటాయా ? ఇవన్నీ ఇప్పుడు ఏపీ ప్రజలకు వస్తున్న అనుమానాలు. ఎందుకంటే శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డుపై ఆటోలో కూలిపనికి వెళ్తున్న వారిపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి.ఈ కారణంగా ఆరుగురు మహిళా కూలీలు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇప్పుడు ఈ ప్రమాదానికి అధికారులు చెబుతున్న కారణం మరింత హైలెట్ అవుతోంది.
హైటెన్షన్ వైర్లను ఉడుతలు కొరికేయడం వల్ల తెగిపోయాయని అందువల్లే అవి తెగి ఆటోపై పడ్డాయని ఇందులో ఎలాంటి సిబ్బంది నిర్లక్ష్యం లేదని కరెంట్ అధికారులు ప్రకటించేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. విద్యుత్ సంస్థలకు కనీసం నిర్వహణ ఖర్చులకూ నిధులు కేటాయించకపోవడం వల్ల సర్వీస్ నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. నిబంధనల ప్రకారం చేయాల్సిన తనిఖీలు… చెకింగ్స్ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. ప్రాణాలు పోయిన తర్వాత అధికారులు పిట్టకథలు చెప్పి అందర్నీ నమ్మించాలని చూస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. దీంతో పారిస్లో ఉన్న జగన్ పేరుతో ఓ ప్రకటన కూడా వెలువడింది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని.. రూ. పది లక్షల నష్టపరిహారం కూలీల కుటుంబాలకు ప్రకటించారని దాని సారాంశం. కానీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పోయిన ప్రాణాలకు ఖరీదు కట్టేందుకు హడావుడి చేశారు కానీ అసలు ఎందుకింత నిర్లక్ష్యం అనేదాన్ని మాత్రం మరుగున పడేయాలన్న తాపత్రయం మాత్రం చూపిస్తున్నారు.
ఇంతకు ముందు ఇలాంటి పిట్టకథలు అధికారులు చాలా చెప్పారు. అంతర్వేది రథం తగలబడినప్పుడు తేనెటీగలు, మద్యం మాయం అయినప్పుడు ఎలుకలు డం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం వంటి కారణాలు చెప్పారు. ఇప్పుడు ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగాయని చెబుతున్నారు. ఇలాంటివన్నీ జగన్ రెడ్డి పాలనలోనే సాధ్యమని నారా లోకేష్ ట్వీట్లో ఎద్దేవా చేశారు.