”ఆడదాని చేతికి విషం ఇచ్చి పంపినపుడే నీవు ఓడిపోయావు డిమిత్రియస్. అయినా మాకు మేలే జరిగింది. నేను లేకపోయినా నా స్ఫూర్తి రగిలింది. పో.. వెళ్లి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు. ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్య గోడలు వుంటాయి. గొడవలు వుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ ఎవడో వచ్చి నాదని అంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల దగ్గరే మీకో స్మశానం నిర్మిస్తాం. మీ మొండాలు మీద మా జెండాలు ఎగరేస్తాం”
‘గౌతమీపుత్ర శాతకర్ణి’లోని క్లైమాక్స్ డైలాగ్ ఇది . ఈ డైలాగ్ తో సినిమా మరో ఎత్తుకు లేస్తుంది. క్లైమాక్స్ కు ఆయువుపట్టు లాంటి డైలాగ్ ఇది. అయితే ఈ డైలాగ్ వెనుక మాత్రం మాటల్లో చెప్పలేని కష్టం వుందని అంటున్నారు రచయిత బుర్రా సాయి మాధవ్ .
అసలు ఈ క్లైమాక్స్ గురించి దర్శకుడు క్రిష్, రచయితగా తాను పడిన కష్టం గురించి ముచ్చటించారాయన. ‘గౌతమీపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ పెద్ద పరీక్ష పెట్టింది. చాలా వెర్షన్స్ లు అనుకున్నాం. చాలా పేజీల డైలాగులు రాసాను. ఏదీ తృప్తిని ఇవ్వడం లేదు. అసలు సినిమాని ఎలా ముగించాలో అర్ధం కాని సందిగ్ధం లో పడిపోయాం. అంతా బావుంది. క్లైమాక్స్ మాత్రం తృప్తిని ఇవ్వడం లేదు. ఒక సమయంలో విసుగువచ్చి రెండ్రోజులు పెన్ను పట్టుకోవడమే మానేశాను. తర్వాత మళ్ళీ కూర్చున్నాను. ఈసారి ఓ నాలుగు డైలాగులు అనుకున్నాను. క్రిష్ గారికి చూపించాను. పైన చెప్పిన డైలాగ్ లో ఆయనకి క్లైమాక్స్ దొరికిపోయింది. ఇదే మన క్లైమాస్ అన్నారు. ప్రేక్షకులు కూడా అదే సరైన ముగింపు అని ఫీలవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది ‘’అని చెప్పుకొచ్చారు సాయి మాధవ్
ప్రస్తుతం బుర్రా సాయి మాధవ్ టాక్ అఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటు బాలకృష్ణ వందో చిత్రానికి అటు మెగాస్టార్ చిరంజీవి 150చిత్రానికి మాటలు రాసే రేర్ ఫీట్ ను కూడా తన ఖాతాలో వేస్తుకున్నారు సాయి మాధవ్.