హిట్టు సినిమా తీయాలంటే ‘బుర్ర’కావాలి. ఆ ‘బుర్ర’ చుట్టూనే సినిమా తీస్తే హిట్టు కొట్టలేమా?? అనుకున్నాడేమో – డైమండ్ రత్నబాబు ‘బుర్ర కథ’ అనే సినిమా తీసేశాడు. బుర్ర కథ అంటే – అదో సంప్రదాయ కాలక్షేపం అనుకుంటారు. కానీ ఇక్కడ `బుర్ర`కున్న అర్థం వేరు. ఒక మనిషి బుర్ర రెండు రకాలుగా పనిచేస్తుండడం. ఒకటి క్లాసు, మరొటి మాసూ. అదే ఈ బుర్ర కథ కాన్సెప్ట్. అభిరామ్ అనేవాడు రెండు రకాలుగా ఆలోచిస్తుంటాడు. అందులో ఒకడికి సన్యాసి అవ్వాలనుకుంటే, ఇంకొకడికి సన్నీలియోన్ కావాలనిపిస్తుంటుంది. అంత వేరియేషన్ అన్నమాట. మరి ఈ వేరియేషన్ వల్ల ఎంత వెరైటీ వచ్చిందో తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ట్రైలర్లో కాన్సెప్ట్ మొత్తం కళ్లకు కనిపించేస్తోంది. హీరో ఆదికి కంటే, ఆది తండ్రిగా కనిపించనున్న రాజేంద్రప్రసాదే ఎక్కువ డైలాగులు చెప్పాడు. ‘ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడితో అయినా పెట్టుకో కానీ కొడుకు ఉన్నవాడితో పెట్టుకోకు’ అని చెప్పడం బట్టి చూస్తే ఇందులో యాక్షన్ కీ ‘సీన్’ ఉందని అర్థమవుతూంది. అభిగా రామ్‌గా ఆది వేరియేషన్స్ చూపించాడనే చెప్పాలి. ‘వన్ అవర్ మథర్ థెరీసా’ అనుకునే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా వెరైటీగానే ఉంది. చివర్లో ఫృథ్వీ ‘సాహో’ డైలాగ్‌ని పేరడీ చేయడం కొసమెరుపు. ఇది వరకు సినిమా వచ్చాక – ఎపిసోడ్లు గానీ, డైలాగులు గానీ పేరడీ చేసేవారు. ఇప్పుడు ఇంకాస్త తొందరపడుతున్నారనిపిస్తోంది. ఈనెల 28న ఈ సినిమా రాబోతోంది. ఇంకెన్ని పేరడీ సీన్లు పడ్డాయో చూడాలి.