దేశవ్యాప్తంగా ఇవాళ్ల స్వచ్ఛందంగా ప్రజలు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు, రెండో దశకు చేరకుండా నిలువరించే ప్రయత్నంలో భాగంగా కేంద్రంతోపాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకూ దేశంలో అన్ని రకాల ప్యాసింజర్లు రైళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. మెట్రో రైళ్లు కూడా ఆగిపోతాయి. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే తిరుగుతాయి. ఇప్పటికే ప్రయాణాల్లో ఉన్న రైళ్లను వాటి గమ్యస్థానాలు చేరుకునే వరకూ అనుమతిస్తారు. దీంతోపాటు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అవసరమైన ప్రయాణాలను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రయాణిస్తున్నవారిలో కరోనా బాధితులుంటే, వారిని గుర్తించడమే ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. విమానాశ్రయాల్లో ఎలాగూ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులను నిలిపేయడం ద్వారా… వైరస్ వ్యాప్తిని సమూలంగా అరికట్టొచ్చు అనేది ప్రభుత్వ వ్యూహం. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ రాష్ట్ర సరిహద్దులను మూసేసింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్నవారిని రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఆపేశారు. వారికి అవసరమైన సదుపాయాలను పోలీసు యంత్రాంగం కల్పిస్తోంది.
ఇక ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అవసరమైతే నెలాఖరు వరకూ లాక్ డౌన్ ప్రకటించే ఛాన్స్ ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.