విశాఖలో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ కూలిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ దక్షణ సైడ్ ఇటీవల నూతన బస్ షెల్టర్ని నిర్మించారు. విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇది మోడ్రన్ బస్ షెల్టర్ అని చెప్పుకున్నారు. కానీ అది శాశ్వత నిర్మాణం కాదు. రేకులతో కట్టేసి.. పిల్లర్ లేకుండా రాడ్లతో కట్టేశారు. దానికి అందంగా డెకరేషన్ చేసి జగన్ రెడ్డి పథకాల వినైల్ బోర్డులు పెట్టారు. ఇది నిర్మించి మూడు నెలలు మాత్రమే అయింది.
ఉదయం హఠాత్తుగా అది వంగిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే జీవీఎంసీ అధికారులు వచ్చి.. బస్ షెల్టర్ ను ఏ పార్టుకు ఆ పార్ట్ పీక్కుని వెళ్లిపోయారు. ఈ వ్యవహారం నగరంలో చర్చనీయాంశమయింది. ఈ బస్ షెల్టర్ల నిర్మాణమే పెద్ద స్కామనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం ఇరవై చోట్ల ఇదే డిజైన్ తో బస్ షెల్టర్లు నిర్మించారు. దీనికి కేటాయించిన బడ్జెట్ నాలుగు కోట్లు. ఒక్కొక్కటి కనీసం నాలుగైదు లక్షలు కూడా చేయదని.. వాటిని చూస్తేనే అర్థమైపోయింది. కానీ నాలుగు కోట్లు ఊడ్చేశారు.
ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి, పట్టుమని నెల రోజులు కూడా నిలవకుండానే కుంగిపోవడం పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ షెల్టర్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని మండిపడుతున్నారు. విశాఖ పేరు చెప్పి దోచుకున్నది అనంతంగా ఉందని చివరికి బస్ షెల్టర్ల విషయంలోనూ అదే పని చేస్తారా అన్న ఆగ్రహం కనిపిస్తోంది. అయితే కూల్చి వేయడం చాలా ఈజీ కానీ కట్టడమే కష్టమని…అది ఈ ప్రభుత్వానికి చేతకానిదన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.