హైదరాబాద్‌కు బస్సు సర్వీసులు ప్రారంభించడానికి ఏపీ సర్కార్ తంటాలు పడుతోంది. ఏపీఎస్ఆర్టీసీ అధికారులను తెలంగాణ ముప్పుతిప్పలు పెడుతోంది. చర్చల పేరుతో.. నెలల తరబడి కాలయాపన జరుగుతున్నా.. తెలంగాణ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఏపీ అధికారులు కక్కలేక.. మింగలేక తెలంగాణ చెప్పినవన్నీ కాకపోయినా కొన్ని చేస్తామంటున్నారు. కానీ తెలంగాణ మాత్రం ఏపీలో కూడా బస్సులుఎలా నడపాలో చెబుతోంది. దీంతో ఆర్టీసీ అధికారులకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా మంత్రుల స్థాయి సమావేశాన్ని ఖరారు చేసుకున్నారు. కానీ తెలంగాణ మాత్రం… అధికారుల స్థాయిలో ఒప్పందం జరిగిన తర్వాతనే ఏపీ మంత్రితో సమావేశం అవుతానని తేల్చేశారు.
ఏపీలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున బస్సు సర్వీసులు ఉంటాయి. ఏపీ ఆర్టీసికి వస్తున్న ఆదాయంలో.. దాదాపుగా 40 శాతం ఈ రూట్ నుంచే వస్తుందని చెబుతూంటారు. తెలంగాణకు వచ్చే ఏపీ బస్సులు పరిమితంగానే ఉంటాయి. అందుకే.. ఏపీ బస్సులు తమ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయో…తాము అన్ని తిప్పుకుంటామని తెలంగాణ సర్కార్ చెబుతోంది. అయితే.. అలా ఇచ్చే పర్మిషన్లు కూడా… విజయవాడ, కర్నూలు నుంచి హైదరాబాద్ కు తిప్పుకునేలా ఉండాలని అంటున్నారు. వివిధ జిల్లా నుంచి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలనుకునేవారిని విజయవాడ, కర్నూలు వరకు మాత్రమే తీసుకు రావాలని అక్కడి నుంచి ఏపీ, తెలంగాణ బస్సుల్లో హైదరాబాద్‌కు వస్తారని టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. అంటే… విజయవాడ, కర్నూలు నుంచి ఏపీ ఎన్ని బస్సులు నడుపుతుందో.. తెలంగాణ ఆర్టీసీ కూడా అన్నే నడుపుతుందన్నమాట.
దీనిపై ఏపీఆర్టీసీ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఇలా చేస్తే..తమ ఆదాయాన్ని తెలగాణ ఆర్టీసీకి అప్పగించినట్లే అవుతుందని అంటున్నారు. కానీ తెలంగాణ మాత్రం ఈ విషయంలో పట్టు వీడే అవకాశం కనిపించడం లేదు. అధికారుల స్థాయి చర్చలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఒక వేళ పరిష్కారం లభించకపోతే.. కోర్టుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఫ్రెండ్లీ ప్రభుత్వంపై కోర్టుకు ఎందుకని… ఏపీ పెద్దలు భావిస్తే.. ఆర్టీసీ ప్రయోజనాల సంగతి పక్కన పెట్టి అయినా… తెలంగాణ డిమాండ్‌కు అంగీకరించి.. హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులను విజయవాడ లేదా.. కర్నూలు వరకే వదిలి పెట్టే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంది.