సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో సినిమా ‘బుట్టబొమ్మ’. ఈ రోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ‘బుట్టబొమ్మ’ టీజర్ విడుదల చేశారు. మలయాళ చిత్రం `కప్పెల`కు రీమేక్ ఇది. టీజర్ చూస్తే..కప్పెలని నూటికి నూరుపాళ్లూ ఫాలో అయిపోయారన్న విషయం అర్థమవుతోంది. కాకపోతే.. తెలుగు నేటివిటీకి తగినట్టు కొన్ని మార్పులూ చేర్పులూ చేశారంతే. అనిక, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. సత్య పాత్రలో అనిక సురేంద్రన్ నటించింది. తనే పాత్రే ఈ కథకు కీలకం. ‘బుట్టబొమ్మ’ టైటిల్ కి తగినట్టు అనిక నిజంగా బుట్టబొమ్మలానే కనిపించింది.
ఓ పోకిరి, ఓ ఆటోట్రైవర్, ఓ అమ్మాయి మధ్య నడిచే కథ ఇది. చూడ్డానికి ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది కానీ కాదు. మలయాళంలో ‘కప్పెల’ అంటే దేవుడ్ని స్తుతించే ఓ చోటు. కథలో అమ్మాయి.. ఏసుక్రీస్తుకి అన్ని విషయాలూచెప్పుకొంటుంటుంది. ఇక్కడ ఏసుక్రీస్తు స్థానంలో శ్రీకృష్ణుడ్ని తీసుకొచ్చారు. క్లైమాక్స్ లో ఓ ట్విస్టు వస్తుంది. అది ఎవరూ ఊహించనిదే. ఓ మామూలు స్టోరీ.. ఈ ట్విస్టుతో కాస్త వెరైటీ సబ్జెక్ట్ గా మారిపోతుంది. టీజర్లో విజువల్స్, గోపీ సుందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొంటున్నాయి. ఈ చిత్రానికి గణేష్ రావూరి సంభాషణలు అందించారు. త్వరలోనే విడుదల చేస్తారు.