కర్నూలు ఎంపీ బుట్టా రేణుక భవిష్యత్తు డోలాయమానంలో పడింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖరారు కావడంతో, వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుక ఎక్కడి నుంచి పోటీ చేస్తుందన్న విషయంలో సందిగ్ధత ఏర్పడింది.
బుట్టా రేణుక నేపథ్యం:
హైదరాబాద్ లోని మెరీడియన్ స్కూల్ సముదాయం, బుట్టా పేరుతో ఉన్న మరికొన్ని సంస్థలు కలిగిన పారిశ్రామికవేత్త బుట్టా రేణుక. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి మొదటిసారిగా ఎంపీగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత పరిణామాల లో ఆమె వైఎస్సార్సీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇందుకు అధికారికంగా మీడియాలో వచ్చిన కారణం ఏమిటంటే – జగన్ ఆవిడను కర్నూలు ఎంపీ గా కాకుండా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పడం వల్ల, అది ఆమెకు ఇష్టం లేకపోవడం వల్ల పార్టీ మారింది అన్నది.
అయితే జిల్లాలో స్థానికంగా ఉన్న గుసగుసలని బట్టి చూస్తే ఆమె వైయస్ఆర్సిపి పార్టీని వీడటానికి కారణం ఇది కాదని అనిపిస్తుంది. ఆ గుసగుసల ప్రకారం, బుట్టా రేణుక వైఎస్ఆర్సీపీలో చేరే ముందు పార్టీకి భారీగా ఫండ్ ఇచ్చిందని , అందుకే ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు ఉన్న కర్నూలు నియోజకవర్గాన్ని ఆవిడకు అప్పగించారని, అయితే ముందు గానే – ఇందులో కొంత భాగం డబ్బును ఎన్నికలయ్యాక జగన్ తిరిగి ఆవిడకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని, కానీ ఎన్నికలయ్యాక రావాల్సిన మొత్తం గురించి ఎన్నిసార్లు అడిగినప్పటికీ జగన్ నుండి స్పందన రాలేదని అందుకే పార్టీని వీడింది అని ఆ గుసగుసల సారాంశం. ఈ గుసగుసల లో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ ఆమె పార్టీని వీడిన మాట వాస్తవం.
తెలుగు దేశం లో కోట్ల చేరిక ?
అయితే ఇప్పుడు కర్నూలు సీనియర్ నాయకుడైన సూర్య ప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖరారు అయ్యింది. అంతర్గత సమాచారం మేరకు చూస్తే కోట్ల కి ఒక ఎంపీ స్థానంతో పాటు మూడు నుంచి నాలుగు ఎమ్మెల్యే నియోజకవర్గాలను ఆయన సూచించిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నాయని తెలియవస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కర్నూలు ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కోట్ల బరిలోకి దిగవచ్చు. అలాగే కోట్ల కుటుంబానికి మూడు నియోజకవర్గాల దాకా బాగా పట్టు ఉండటం వల్ల ఆయన సూచించిన వ్యక్తులకు ఆ మూడు టికెట్లు ఇవ్వవచ్చు. ఇదే జరిగిన పక్షంలో బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేనట్లే.
ఎమ్మిగనూరు నియోజకవర్గ రాజకీయం:
అయితే తెలియవస్తున్న మరొక సమాచారం ఏమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా బుట్టా రేణుక ను ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం వస్తుంది. బుట్టా రేణుక ను ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా జయ నాగేశ్వర్ రెడ్డి తో ఒకసారి మాట్లాడమని చంద్రబాబు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే జయ నాగేశ్వర్ రెడ్డి కూడా 2014లో మొదటిసారిగా ఎమ్మిగనూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి బివి మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున 1983 నుండి 2004 వరకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2004 లో, ఆ తర్వాత జరిగిన 2012 ఉప ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2014 ఎన్నికల కంటే ముందే ఆయన చనిపోయారు. దీంతో ఎమ్మిగనూరు టికెట్‌ను 2014లో తెలుగుదేశం పార్టీ , ఆయన తనయుడైన జయ నాగేశ్వర్ రెడ్డి కి ఇచ్చింది. ఈ స్థానం నుంచి ఆయన ఘన విజయం సాధించారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా 1000 రోజులు ఆడిన నియోజకవర్గం ఇది. టీవీ లో ఆ సినిమా ఎన్నోసార్లు వేసినప్పటికీ ఆ సినిమా వెయ్యి రోజుల పాటు ఆ ఊర్లో ఆడిందంటే అది ఆయన చలవే అని కూడా స్థానికులు అంటుంటారు. ఇప్పుడు జయ నాగేశ్వర రెడ్డి ని ఆ స్థానం నుంచి తప్పించి బుట్టారేణుక కు టికెట్ ఇస్తే ఆయన ఒప్పుకుంటాడా అన్నది సందేహం.
బుట్టా రేణుక ఎమ్మిగనూరులో గెలుస్తుందా?
అయితే బుట్టా రేణుక కు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బాగానే పట్టు ఉంది. నియోజకవర్గంలో చేనేతల సామాజికవర్గం అధిక సంఖ్యలో ఉండడం ఇందుకు ఒక కారణం అయితే, ఇంకొక కారణం ఆమె చేసిన సహాయాలు. ఆమె ఎంపీగా ఉన్న ఈ నాలుగేళ్లలో, ఎమ్మిగనూరు నుండి పనుల కోసం, మాట సహాయం కోసం ఆమె దగ్గరకు వెళ్ళిన ఏ ఒక్కరిని కూడా కాదనకుండా ఆమె సహాయం చేసి పెట్టింది. అందులోనూ కార్పొరేట్ శైలిలో ప్రొఫెషనల్ గా ఆమె వ్యవహరించే తీరు, సాయం కోసం వచ్చిన వారికి చకచకా పనులు చేసిపెట్టే తీరు ఇవన్నీ తనకు ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ కారణంగానే అప్పుడు వైఎస్సార్సీపీ, ఇప్పుడు తెలుగుదేశం ఆమెను ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆమె ఈ స్థానం నుంచి ఈ ఏ పార్టీ తరపున పోటీ చేసినా గెలిచే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయని కూడా చెప్పక తప్పదు. అయితే ఆమె మాత్రం మళ్లీ ఎంపీగానే పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు, అలాగే ఎమ్మిగనూరు సీటు వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి విముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
మొత్తం మీద:
దీంతో ఆమె ఏ స్థానం నుండి పోటీ చేస్తుందో, ఆమె కోరుకున్న ఎంపీ టికెట్ ఆమెకు వస్తుందో రాదో, చివరి నిమిషంలో బాబు గనక ఆమెకు చెక్ పెడితే ఏమి చేస్తుందో అన్న విషయాల్లో సందిగ్ధత నెలకొన్న కారణంగా ఆమె భవిష్యత్తు ప్రస్తుతానికి డోలాయమానంలో పడింది.
– జురాన్ (CriticZuran)