కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టిడిపిలోకి వస్తారని కొద్దిరోజులుగా జరిగిన ప్రచారానికి సాక్షాత్తూ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డే ముగింపు పలికిన విషయం తెలిసిందే. చివరిదాకా కాంగ్రెస్ లోనే ఉంటానని, ఒకవేళ పార్టీకి భవిష్యత్తు లేకపోతే, వ్యవసాయం చేసుకుంటాను తప్ప పార్టీ మారనని చెప్పిన కోట్ల తాను టిడిపిలో చేరుతానని వస్తున్న వార్తలన్నిటికీ చెక్ పెట్టేసాడు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు తన ఇంటికి వస్తానని అన్నాడని, కానీ తర్వాత ఆ ప్రోగ్రాం మారిపోయిందనీ, అయితే ఆయన వస్తే మాత్రం సాదర స్వాగతం పలుకుతానని చెప్పి బాబు ని కాస్త ఇరకాటం లోకి నెట్టాడు. మొత్తానికి, బాబు ప్రయత్నించినా తాను లొంగలేదనే సందేశాన్ని మాత్రం జనాల్లోకి పంపగలిగాడు. అయితే ఈ తరహా స్పందనని ఊహించే బాబు కోట్ల ఇంటికి వచ్చే ప్రోగాం ని మానేసాడనీ ప్రచారం జరుగుతోంది.
అయితే ఇక వైసిపి ఎం పి బుట్టా రేణుక మీద ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె పార్టీ మారతారన్న వార్తలు, 2014 ఎలక్షన్స్ అయిన వెంటనే మొదలయ్యాయి. ఇక నంద్యాల ఎన్నికలకి ముందు కూడా ఆమె టిడిపి తో టచ్ లోకి వచ్చినపుడు ఇలాంటి వార్తలే వచ్చాయి. అయితే ఇటీవల నోబెల్ అవార్డ్ గ్రహీత కైలాష్ సత్యార్థి, బాబు తో కలిసి కర్నూల్ లో చేసిన ర్యాలీ లో బుట్టా రేణుక మిగిలిన టిడిపి లీడర్లతో సమానంగా పాల్గొనడం తో మళ్ళీ బుట్టా పార్టీ మారే సమయం ఆసన్నమైందన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి.
అయితే త్వరలో కర్నూల్ కార్పొరేషన్ ఎన్నికలు రానుండడం తో, ఆ సమయానికి ఇలాంటి సంచలనాలు మరిన్ని చోటు చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి..