కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక హఠాత్తుగా తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉంటానని కూడా శపథం చేశారు. రాజకీయ నేతలు ఇలాంటి ప్రకటనలు చేశారంటే ఖచ్చితంగా అనుమానించాల్సి ఉంటుంది. బుట్టా రేణుక ప్రస్తుత రాజకీయాల్లో ఫేడవుట్ అయిపోయారు. హైదరాబాద్‌లో ప్రైమ్ లొకేషన్లో కన్వెన్షన్ సెంటర్, స్కూల్ ఉన్న ఆమె ..వైసీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ నిలకడ లేక ఆ పార్టీ.. ఈ పార్టీ అని పదే పదే మారడంతో విలువ కోల్పోయారు. 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి గెలిచిన తర్వాత కొద్ది రోజులకే టీడీపీలో చేరారు. మళ్లీ చేరలేదని చెప్పుకొచ్చారు.
చివరికి టీడీపీలో చేరిన టిక్కెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో… మళ్లీ వెళ్లి వైసీపీలో చేరారు. అక్కడ చేర్చుకున్నారు కానీ.. తర్వాత పట్టించుకోలేదు. టిక్కెట్ ఇవ్వలేదు. పదవులు ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీలో కనీస ఆదరణ కూడా దక్కడంలేదు. దీంతో… తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ముందు వైసీపీ హైకమాండ్‌పై ఒత్తిడి పెంచుదామని అనుకున్నారో లేకపోతే.. నిజంగానే రాజకీయం కోసం పక్క చూపులు చుద్దామనుకున్నారో కానీ… పార్టీ మారబోతున్నట్లుగా కొన్ని సంకేతాలు సన్నిహితులైన జర్నలిస్టులకు పంపారు. అయితే ఆమె పెద్దగా ఫేమ్‌లో లేదు కాబట్టి.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఓ చానల్‌తో పాటు… కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో… ఇదే సందు అనుకుని వెంటనే స్పందించారు. తాను పార్టీ మారబోవడం లేదని చెప్పుకొచ్చారు. ఆమె ప్రకటనలోని విధేయత… వైసీపీ హైకమాండ్ వరకూ వెళ్తుందా .. కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా ఆఫర్ చేస్తారా అని… కర్నూలు జిల్లా నేతల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకూ చాలా సార్లు అనేక పదవుల భర్తి ప్రస్తావన వచ్చింది కానీ.. ఆమె పేరు అసలు ఎక్కడా ప్రచారంలోకి రాలేదు.