విశాల్ కొత్త సినిమా ‘పందెం కోడి 2’ విడుదల ఇప్పుడు సమస్యగా మారిందా? ఈ సినిమాకి క్లియరెన్స్ రావడం కష్టమా? ఆ ప్రమాదం ఉందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈమధ్య విశాల్ వరుస ఫ్లాపులుఇచ్చాడు. విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాకి మాత్రమే మంచి వసూళ్లు వచ్చాయి. అంతకు ముందన్నీ వరుస ఫ్లాపులే. వాటి వల్ల తెలుగులో విశాల్ సినిమాని కొన్న బయ్యర్లు బాగా నష్టపోయారు. విశాల్ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం… ఇప్పటి వరకూ బయ్యర్లకు సెటిల్ చేయాల్సిన మొత్తం అటూ ఇటూగా రూ.20 కోట్ల వరకూ ఉంది. వాటిని సెటిల్ చేయకుండా `పందెంకోడి 2` విడుదల చేసే పరిస్థితి లేదు. విశాల్ సినిమాలు కొని నష్టపోయిన బయ్యర్లంతా ఒక్కతాటిపైకి వచ్చి… విశాల్‌పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విశాల్ కూడా వీటన్నింటినీ సింగిల్ సెటిల్మెంట్తో క్లియర్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే.. ఇవ్వాల్సిన అంకెకీ, ఇప్పుడు ఇస్తానన్న అంకెకీ పొత్తు కుదరడం లేదట. గత బాకీలన్నీ తీర్చేస్తే తప్ప ‘పందెంకోడి 2’కి తెలుగులో క్లియరెన్స్రాదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలే గరం గరంగా నడుస్తున్నాయని సమాచారం. ‘పందెంకోడి’ సీక్వెల్ కాబట్టి ఈ సినిమాపై విశాల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ట్రైలర్ మాసీగాఉండడం, కీర్తి సురేష్ గ్లామర్ కలసి రావడం – పందెం కోడి క్రేజ్ పెంచాయి. పైగా దసరా సీజన్ కావడం కూడా ప్లస్ పాయింటే. ఇంత మంచి రిలీజ్ డేట్‌ని వదులుకోవడానికి విశాల్ సిద్దంగా లేడు. మరి ఈ సెటిల్మెంట్స్ని ఎంత త్వరగా క్లియర్ చేస్తాడో చూడాలి.