కరోనా ఎంత పని చేసింది? సినిమాల్లేకుండా చేసింది. థియేటర్లు మూసేసింది. నిర్మాతల కంటిమీద కునుకు లేకుండా చేసింది. చిత్రసీమ ప్రగతిని పదేళ్ల క్రిందకు నెట్టేసింది. ఇప్పుడు సినిమా తీయాలన్నా,వ విడుదల చేయాలన్నా, అసలు సినిమా గురించి ఆలోచించాలన్నా.. భయం.. భయం.
ఇది వరకు ‘మీ సినిమా మేం కొంటాం’ అని నిర్మాతల చుట్టూ తిరిగిన బయ్యర్లు, ఇప్పుడు కొన్న సినిమాల్ని వెనక్కి పంపిస్తున్నారు. `మీ సినిమాలు మాకొద్దు` అని తెగేసి చెబుతున్నారు. ఇది వరకే అడ్వాన్సులు కట్టేసిన వాళ్లు ఇప్పుడు వాటిని వెనక్కి ఇమ్మని పీకల మీద కూర్చున్నారు. పరిస్థితులు అలా ఉన్నాయి.
లాక్డౌన్కి ముందే కొన్ని సినిమాలు విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్నాయి. వాటి థియేటరికల్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. అయితే.. ఇప్పుడు అవేం బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. థియేటర్లు తెరచుకుంటాయని ఎదురు చూసిన బయ్యర్లు విసిగి వేసారిపోయారు. అందుకే కొన్ని సినిమాల రైట్స్ వదులుకుంటున్నారు. రెడ్, సోలో బ్రతుకే సో బెటరు, క్రాక్.. ఈ మూడు సినిమాలూ ఇది వరకే అమ్ముడైపోయాయి. వాటికి మంచి రేటుకు కొనుక్కున్నారు బయ్యర్లు. అయితే.. ఇప్పుడు ఈ సినిమాల్ని వదులకున్నారు బయ్యర్లు. ప్రస్తుతం థియేటర్లు తెరచుకునే పరిస్థితి లేనందున అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయమని నిర్మాతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవేళ థియేటర్లు తెరచినా, విడుదల చేసే పరిస్థితుల్లో లేమని తేల్చేశారు. ఒకవేళ విడుదల చేయాల్సివస్తే, కమీషన్ పద్ధతిన సినిమాల్ని తీసుకుంటాం తప్ప, కొనలేమని చెప్పడంతో, నిర్మాతలు గతుక్కుమంటున్నారు. ఇవే కాదు… చాలా సినిమాల పరిస్థితి ఇలానే ఉంది. భవిష్యత్తులోనే బయ్యర్లు రిస్కు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ సినిమాల్ని విడుదల చేయాలంటే, ఆ రిస్కేదో నిర్మాతలే స్వయంగా భరించాల్సిన వాతావరణం
కనిపిస్తోంది. మళ్లీ బయ్యర్లకు సినిమాలపై నమ్మకాలు రావాలంటే, డబ్బులు పెట్టడానికి రెడీ అవ్వాలంటే చాలా కాలం పట్టేట్టు ఉంది.