బాహుబలి తెలుగు చిత్రసీమకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా ఖ్యాతి ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తమైంది. తెలుగు సినిమా అంటే ఏమిటో బాలీవుడ్ జనాలకు తెలిసొచ్చింది. అంతర్లీనంగా బాహుబలి తో తెలుగు సినిమా రూపు రేఖలు, మార్కెట్ స్వరూపం మొత్తం మారిపోయింది. అంత వరకూ బాగానే ఉంది. పరోక్షంగా బాహుబలితో కనిపించని నష్టాలతో తెలుగు చిత్రసీమ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నేరుగా ప్రేక్షకుడిపై ప్రభావం పడకపోయినా.. సినిమా పరిశ్రమపైనే ఆధారపడిన బయ్యర్ల వ్యవస్థని తీవ్ర స్థాయిలో కుదిపేస్తోంది. బాహుబలి వల్ల మిగిలిన బడా స్టార్లు, నిర్మాతలూ లాభపడుతుంటే.. బయ్యర్లు మాత్రం బోరు మంటున్నారు.
బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్ నాలుగింతలు పెరిగిందన్నది కాదనలేని సత్యం. అయితే… దాన్ని సాకుగాచూపిస్తూ నిర్మాతలు లాభాలు దండుకొంటున్నారు. ఇది వరకు నైజాం మార్కెట్ రూ.15 కోట్ల వరకూ పలికేది. బాహుబలి వచ్చాక రూ.25 కోట్లు పోయింది. బాహుబలి 2కి రూ.40 కోట్లు పెట్టి కొన్నారు. అంటే దాదాపుగా మూడు రెట్లు పెరిగిందన్నమాట. దాన్ని అదునుగా చేసుకొని ఖైదీ నెం.150 సినిమా రూ.22 కోట్లకు అమ్ముదామనుకొంటున్నారు. ఎప్పుడూ నైజాంలో పది కోట్లు దాటని బాలకృష్ణ సినిమా ఇప్పుడు రూ.15 కోట్లు పలుకుతోంది. ఖైదీ నెం.150 రూ.22 కోట్లన్నా సాధారణ మార్కెట్‌తో పోలిస్తే రూ.7 కోట్లు అధికం. ఇదంతా బయ్యర్లు భరించాల్సిందే కదా? నైజాం అనే కాదు…. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, ఓవర్సీస్… వీటిన్నింటికీ బాహుబలి రేట్లే ప్రాతిపదిక అయిపోయింది. బాహుబలి తరవాత వచ్చిన శ్రీమంతుడు, సర్దార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం, జనతా గ్యారేజ్.. ఈ సినిమాల్ని హయ్యస్ట్ రేట్లకు అమ్ముకొన్నారు. అప్పుడు నిర్మాతలు చూపించిన సంజీవని కూడా… బాహుబలి సినిమానే. ”బాహుబలి అన్ని కోట్లు తెచ్చుకొంది… ఈ సినిమా కూడా అదే రేంజులో ఆడేస్తుంది” అంటూ నమ్మబలికి సినిమాల్ని అమ్ముకొన్నారు. బయ్యర్లు కూడా బాహుబలి మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న ఆశతో కొనేస్తున్నారు. సర్దార్, బ్రహ్మోత్సవం సినిమాలు కొన్న బయ్యర్లు… ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. జనతా గ్యారేజ్ హిట్టయినా ఎక్కువ రేట్లకు కొనడంతో ఎవ్వరికీ డబ్బులు మిగల్లేదు. ఇప్పుడు ఖైదీ నెం150, గౌతమి పుత్ర సినిమాల్ని కూడా బయ్యర్లకు భారీ రేట్లకు అంటగడుతున్నారు.
బాహుబలి… పదేళ్లకోసారి వచ్చే సినిమా. థియేటర్లకు వచ్చి సినిమా చూసే అలవాటు తప్పిపోయిన ఓతరం ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. దాన్ని చూసి వాతలు పెట్టుకొని సంబరపడమంటే ఎలా?? ప్రతీ హీరోకీ ఓ మార్కెట్ ఉంటుంది. ఓ రేంజ్ ఉంటుంది. దాన్ని బట్టే బడ్జెట్ పెడుతుంటారు నిర్మాతలు. కానీ… అమ్మేటప్పుడు మాత్రం బాహుబలిని చూపిస్తున్నారు. ప్రతీ సినిమా బాహుబలి కాదని, ఆ స్థాయిలో ఆడదని నిర్మాతలు, బయ్యర్లు గుర్తించుకోవాలి. హీరోలు, దర్శకులు కూడా ఈగో సమస్యల నుంచి బయటపడాలి. బాహుబలి కంటే ఎక్కువ రేట్లకు అమ్మకపోతే తమ సినిమా సినిమానే కాదన్న భ్రమలలోంచి బయటపడాలి. లేదంటే ఈ హైప్ తట్టుకోలేక, హైక్ అయిన రేట్లకు సినిమా కొనలేక, కొన్న తరవాత వచ్చే నష్టాల్ని తట్టుకోలేక భవిష్యత్తులో బయ్యర్ అనే వాడే కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.