చిరు కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. అగ్ర హీరోల్లో… ఆ స్థాయిలో కామెడీ చేయగలగడం చిరుకే చెల్లింది. వాల్తేరు వీరయ్యలో కూడా చిరు ఫన్ బాగా వర్కవుట్ అయ్యింది. ఈతరం హీరోల్లో… డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ ఓ రేంజ్లో పేలింది. వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? వీరిద్దరూ కలిసి కామెడీ చేస్తే ఏ రేంజ్లో పండుతుంది? త్వరలోనే ఈ కాంబోని వెండి తెరపై చూసి, నవ్వుకొనే ఛాన్స్ ఉంది.
ఔను.. చిరు, సిద్దు జొన్నలగడ్డ ఓ సినిమాలో కలిసి నటించబోతున్నట్టు టాక్. కల్యాణ్ కృష్ణ ఇటీవల చిరుని కలిసి ఓ కథ చెప్పారు. ఇందులో ఓ యువ హీరో పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర కోసం సిద్దు జొన్నలగడ్డని ఎంచుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్. సిద్దు అయితే ఆ పాత్రకు బాగుంటుందని చిరు సూచించారని, వెంటనే సిద్దూ కూడా ఒప్పుకొన్నాడని టాక్. ఈచిత్రానికి `ధమాకా` రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. తనవన్నీ ఫక్తు ఎంటర్టైన్మెంట్ సినిమాలే. అలాంటి కథలకు చిరు కేరాఫ్. మరి.. ఈ కాంబో ఏ రేంజ్లో వినోదం అందిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. భోళా శంకర్ తరవాత చిరు ఈ సినిమానే సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.