జనసేన అద్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల సానుకూలంగా వున్నట్టు చిత్రించడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతుంటుంది. ఇంకా చెప్పాలంటే ఆయన టిడిపి చేతిలో సాధనంగా పనిచేస్తున్నారని ప్రచారం చేయడంలో చాలా రాజకీయం వుంది.ఆయనతో పొత్తు పెట్టుకుంటే మంచిదని ప్రశాంత్ కిశోర్ వైసీపీ నేత జగన్కు సలహా ఇచ్చారని మరో కథనం. ఇద్దరు ప్రత్యర్థులతో మంచిగా వుండేట్టయితే పవన్ రాజకీయ పాత్ర ఏమిటని వీరనుకుంటున్నారో అర్థం కాదు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటున్నప్పుడు పవన్ అమరావతి వెళ్లి ఆయనతో భేటీ కాబోతున్నట్టు ఒక కథనం వచ్చింది. ఇహనో ఇప్పుడో కలిసేస్తున్నారంత హంగామా కనిపించింది. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై కలుస్తున్నారంటూనే రాజకీయ ప్రాధాన్యత కల్పించే కథనాలు వచ్చాయి. నేడే భేటీ అన్నట్టు కొన్ని ఛానళ్లు సిద్ధమై పోయాయి. తీరా అది జరగలేదు. ఇప్పుడు ఆ పత్రికలే నెలాఖరులో భేటీ కావచ్చని కథనాలు ఇస్తున్నాయి. నేడో రేపో జరిగితే వేరే సంగతి గాని ఎప్పుడో తేదీ ఖచ్చితంగా తెలియకుండానే ఎందుకు లేనిపోని హడావుడి హంగామా చేస్తున్నట్టు? ఎందుకైనా సరే ఇది సరికాదని మాత్రం చెప్పవలసి వుంటుంది. ఒకసారి ఏదో హడావుడి పడ్డారంటే అదో రకం. మొన్న చెప్పినట్టు భేటీ జరక్కపోయినా మళ్లీ మొదలు పెట్టారంటే కావాలనే చేస్తున్నారన్నమాట.. వైసీపీ లేదా వామపక్షాలు చెబితే వినని ముఖ్యమంత్రి చేసినా చేయకపోయినా పవన్ మాటకు మాత్రం విలువ ఇచ్చినట్టు కనిపిస్తారనేది అనుభవం. ఇది కూడా వ్యూహాత్మకమేనని వేరే చెప్పాలా!