రాజకీయ పరిణామాలను ఆర్థిక ప్రభావాలను విశ్లేషించడంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు సిద్ధ హస్తులు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తున్న రాఘవులు ఇటీవల నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో వేర్వేరు రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ఎపి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాదు జిల్లాల్లోనూ కూడా ఆయన వర్గం అండలేకుండా పోయిందనీ, వారిని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత తీసుకున్నారని రాఘవులు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పార్టీ మారినంత మాత్రాన రాజకీయ పునస్సమీకరణ జరిగిపోయిందనడం వాస్తవికత కాదని కూడా ఆయన చెబుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసినా తమ ఎంఎల్ఎలనైనా శాసనసభకు పంపకుండా బహిష్కరించడం సరికాదని కూడా విమర్శించారు. ఎపి రాజకీయాల్లో కొత్తశక్తిగా వస్తానంటున్న పవన్ కళ్యాణ్ సరైన విధానం తీసుకుంటేనే ప్రయోజనం వుంటుందని అలాగాక టిడిపినో బిజెపినో బలపరిస్తే తను పెరిగేది వుండదని కూడా స్పష్టం చేశారు. నాడు చిరంజీవి అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా రంగంలో వుండాలి తప్ప గెలిస్తే సామాజిక న్యాయం లేకుంటే చేతులెత్తేస్తామన్నట్టు వ్యవహరించకూడదని సూచించారు. 2009లో చిరంజీవితో తాము పొత్తు పెట్టుకోకపోవడానికి ఒకే ఒక కారణం ఆయన మతోన్మాద బిజెపితో కలిసేది లేదని ముందుగా ప్రకటన చేసేందుకు సిద్ధపడకపోవడమేనని రాఘవులు గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా విధానపరమైన స్పష్టతతో జయాపజయాలతో నిమిత్తం లేకండా రంగంలో నిలబడితేనే ప్రభావం వుంటుందని కూడా రాఘవులు అంచనా వేస్తున్నారు.