తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విజేత ఎవరన్నది మధ్యాహ్నం కల్లా తేలిపోనుంది. మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలుపెడతారు.
ప్రతీ ఈవీఎంను మూడుసార్లు లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. ఈవీఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూంల ముందు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. లోపలా బయటా సీసీ కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా పెట్టింది. ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ తో పాటు స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు. ఎనిమిది గంటల తర్వాత వాటిని ఓపెన్ చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో, హైదరాబాద్ లో 13 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి 14 ప్లస్ 1 చొప్పున టేబుల్స్, పోలింగ్ కేంద్రాలు ఎక్కువున్న నియోజకవర్గాలకు ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు ఆరుగురు అధికారులు ఉంటారు. మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో సహా ఒక్కో టేబుల్ కు మొత్తం ఆరుగురు ఉంటారు.