కంచ గచ్చిబౌలి వ్యవహారంలో అసలు నిజం ఒక్క శాతం ఉంటే ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, ఫోటోలతో జరిగిన ప్రచారమే 99 శాతం ఉంది. అదేదో అద్బుతమైన చిట్టడవి అందులో సెలయేళ్లు, నెమళ్లు, జింకలు ఉన్నట్లుగా సృష్టించారు. చూస్తూనే చాలా సులువుగా ఇది ఏఐ ఫోటోలు , వీడియోలు అని అర్థమైపోతాయి. కానీ ఉద్దేశపూర్వకంగా వాటిని చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు షేర్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇప్పుడు వారందరిపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.
నేరుగా కేసులు పెట్టడం కన్నా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుని పెడితే తప్పించుకోలేరన్న ఉద్దేశంతో స్మార్ట్ గా ఆలోచించి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరవై నాలుగో తేదీన కోర్టులో విచారణ జరగనుంది. ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవద్దని ఏ కోర్టూ చెప్పదు కాబట్టి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు ఫేక్ వీడియోలను , ఏఐ ఫోటోలను డిలీట్ చేయడం ప్రారంభించారు.
అయితే ఉద్దేశపూర్వకంగా తెలిసి ప్రచారం చేసి.. జరగాల్సిన, చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసిన తర్వాత వాటిని డిలీట్ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా అన్న సందేహం ఉంది. పోస్టు చేసింది నిజం. రెచ్చగొట్టింది నిజం అయినప్పుడు .. వాటిని డిలీట్ చేసినంత మాత్రం చట్టం నుంచి తప్పించుకోవడం కష్టం. ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో చాలా సీరియస్ గా ఉంది. కఠిన చర్యలు .. చట్టపరంగా తీసుకోవాలని నిశ్చయంగా ఉంది.