నేడు జరుగుతున్న వరంగల్ ఉప ఎన్నికలు తెరాసకు అగ్ని పరీక్ష వంటివని చెప్పవచ్చును. కడియం శ్రీహరిని రాజీనామా చేయించి ఉండకపోతే అసలు ఈ ఉప ఎన్నికలు వచ్చేవే కాదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ ఉప ఎన్నికలను చేజేతులా తెచ్చి పెట్టుకొని, ఇప్పుడు తెరాస ఏటికి ఎదురీదవలసివస్తోంది. రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యల కారణంగా తెరాస ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు మూట గట్టుకొంది. ప్రతిపక్షాలు ఆ సమస్యపై ఆందోళనలు చేస్తున్నప్పుడయినా అది మేల్కొనకుండా, గత ప్రభుత్వాల మీద ఆ నెపం వేసి చేతులు దులుపుకొనే ప్రయత్నాలు చేయడంతో రైతుల ఆగ్రహానికి గురయింది.
ఆ తరువాత రైతుల పంట రుణాలు మాఫీ చేయమని ప్రతిపక్షాలు కోరినప్పుడు వారిని శాసనసభ నుండి సస్పెండ్ చేసి మరో పెద్ద పొరపాటు చేసింది. వారు తెలంగాణాలో ఊరూరు తిరిగి రైతుల పట్ల తెరాస ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి ప్రచారం చేసారు. అప్పుడు తెరాస మేల్కొని పంట రుణాలన్నీ ఒకేసారి రద్దు చేస్తామని ప్రకటించింది. కానీ అప్పటికే జరుగవలసిన నష్టం జరిగిపోయింది. తెరాస ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే భావన రైతులలో ఏర్పడింది.
గత ఏడాదిన్నర పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు మాత్రమే మిగిలాయి తప్ప ఆచరణలో ఏదీ కనిపించడం లేదు. ఇటువంటి సమయంలో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక ఇవి తెరాసకు జీవన్మరణ సమస్య వంటివేనని చెప్పక తప్పదు. ఈ ఉప ఎన్నికలలో ఓడిపోయినట్లయితే తెరాస ప్రభుత్వం గురించి ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలకు, విమర్శలకు ప్రజల ఆమోదం పొందినట్లవుతుంది. అందుకే చేజేతులా తెచ్చిపెట్టుకొన్న ఈ ఉప ఎన్నికలలో గెలవడానికి తెరాస నేతలు అందరూ గత రెండు వారాలుగా జిల్లాలోనే తిష్ట వేసి కష్టపడుతున్నారు. భారీ మెజార్టీ సాధించడానికే తామంతా కష్టపడుతున్నామని వారు చెప్పుకొంటునప్పటికీ, ఈ గండం గట్టెక్కితే చాలని వారందరూ ప్రార్దిస్తున్నారని చెప్పవచ్చును. ఇంత కష్టపడినా ఒకవేళ ఓడిపోతే అప్పుడు వారికి, తెరాస ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా అది చెంపదెబ్బ కొట్టినట్లే అవుతుంది. కనుక ఈ ఉప ఎన్నికలలో తెరాస భారీ మెజార్టీ సాధించలేకపోయినా కనీసం గెలిచితీరాలి.